రచయితగా ఉండి దర్శకుడిగా మారి సామాజిక చైతన్యం కలగలిసిన చిత్రాలకు తనదైన కమర్షియల్ టచ్ ఇచ్చి, నాటి టి.కృష్ణ, ముత్యాల సుబ్బయ్య, కోడి రామకృష్ణ వంటి వారి మార్గంలో పయనిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆయన వరుసగా 'మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్' లతో బ్లాక్‌బస్టర్స్ కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేసిన దర్శకునిగా, రెండో చిత్రం సెంటిమెంట్‌ని కూడా దాటిన డైరెక్టర్‌గా టాప్ దర్శకుల లీగ్‌లో ఉన్నాడు. ఇక ఈయన ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా 'భరత్ అనే నేను' చిత్రం తీస్తున్నాడు. రాజకీయాలు ఎలా ఉండాలి? రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? అనే పాయింట్ ఆధారంగా ఈయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంతో వరుసగా నాలుగో హిట్‌ని కొరటాల కొట్టడం ఖాయమని, ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా రెండు డిజాస్టర్స్‌తో ఉన్న మహేష్‌కి బ్లాక్‌బస్టర్ ఇవ్వడం గ్యారంటీ అని అందరు నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత కొరటాల శివ ఏ హీరోతో చేస్తాడు? అనే విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అల్లుఅర్జున్, నాని పేర్లు తెరమీదకి వచ్చాయి.
ఇక కొరటాల శివ తన చిత్రాలలో ఎవ్వరూ వేలు పెట్టడాన్ని సహించడు. తాను నమ్మిన సబ్జెక్ట్‌ని, దానిని నమ్మిన నిర్మాతలు, హీరోలతోనే ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం అక్కినేని అఖిల్ పరిస్థితి దారుణంగా ఉంది. 'మనం' చూసి ఏవేవో ఊహించుకున్న వారికి 'అఖిల్'తో షాక్ ఇచ్చాడు. ఇక దాంతో రెండో చిత్రం బాధ్యతలను నాగార్జుననే తీసుకుని విక్రమ్ కుమార్ చేత దగ్గరుండి అన్ని చూసుకుంటూ, ఇన్‌వాల్వ్ అయి, గ్యారంటీగా బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అని చెప్పిన 'హలో' చిత్రం కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. ఈ చిత్రం 'మనసంతా నువ్వే'కి హైటెక్ వెర్షన్ అనే చెడ్డపేరు వచ్చింది. ఇక అఖిల్ చిత్రం అంటే అందునా రెండు ఫ్లాప్స్ తర్వాత అనేసరికి సినిమా కథ, తీయడంలో కూడా నాగార్జున ఇన్‌వాల్వ్ కావడం ఖాయం. అదే ఉద్దేశ్యంతోనే నాగార్జున కొరటాల శివకి అఖిల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తే 15కోట్లు ఇస్తానన్నా కూడా కొరటాల సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. మరి నానితో చేయనున్నాడని వార్తలు వస్తున్నవేళ 15కోట్ల ఆఫర్, అఖిల్, నాగ్‌లని కొరటాల తిరస్కరించాడంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది...! ఇక అఖిల్ తన మూడో చిత్రంగా ఇటీవలే వరుణ్‌తేజ్‌కి 'తొలిప్రేమ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో చేయనున్న సంగతి తెలిసిందే.