బిజెపికి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో పట్టు లేదు. కేవలం ఏదో వెంకయ్యనాయుడు, నరేంద్ర, బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్ వంటి నాయకులు ఉన్నారే గానీ వీరికి ఏపీలో కమ్యూనిస్ట్‌లకు ఉన్న బలం కూడా లేదు. కానీ ఈ విషయం పవన్‌కి అర్ధమైనట్లుగా లేదు. ఈయన మాట్లాడూతూ, ఏపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజల అభిప్రాయం వేరేగా ఉంది... అందుకే ఏపీలో బిజెపి బలహీన పడిందని చెప్పాడు. కానీ బిజెపికి కేవలం ఏపీలో తోకపార్టీగా పేరుంది. వాజ్‌పేయ్‌ని చూసి, నరేంద్రమోదీ గుజరాత్ తరహా అభివృద్ది చేస్తాడని భావించి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే తప్ప బిజెపికి నామ మాత్రపు సీట్లు ఇంతవరకు రాలేదు. వెంకయ్యనాయుడు వంటి వాడే ప్రత్యక్షరాజకీయీలలో తనకు ఎవ్వరూ ఓటు వేయరని భావించి దొడ్డిదారిన రాజ్యసభకు కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి, నేడు ఉపరాష్ట్రపతి అయ్యాడు. అలా చూసుకుంటే ఏపీలో బిజెపి ప్రభావం శూన్యమనే చెప్పాలి. ఇక తాజాగా పవన్‌కళ్యాణ్ 'ఎన్డీటీవీ'లో మాట్లాడుతూ, తనకి వ్యక్తిగతంగా మోదీ అంటే చాలా ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఇక ఇటీవల జగన్ అంటే కూడా ఎంతో ఇష్టమని, కానీ రాజకీయాలలోవ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చోటు లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్‌ని కూడా టార్గెట్ చేస్తానని చెప్పాడు. ఇక తాను ప్రజలకోసం, ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తూ, యుద్దం చేస్తూనే ఉంటానని తెలిపాడు. పవన్ నాడు చంద్రబాబు అనుభవజ్ఞుడు అని అంటే వైసీపీ పవన్ టిడిపి తొత్తు అని ప్రచారం చేసింది. ఇప్పుడు ఆయన వైకాపాకి అనుకూలం అని టిడిపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పవన్ మోదీ చెప్పినట్లు ఆడుతూ, గేమ్ ప్లే చేస్తున్నాడని, ఆయనకు లోపాయికారీగా మోదీతో, బిజెపితో అవగాహన ఉంది. వైసీపీ ఎన్నికల నిపుణులు ప్రశాంత్ కిషోర్ సూచన మేరకే పవన్ బిజెపి, వైసీపీలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు మాత్రం ఆయన అడుగులు తన అన్నయ్య దిశగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇలా ప్రతి పార్టీతో పవన్‌కి లింకుని కలుపుతూ విమర్శలు వస్తున్నాయి. ఆయనలోని అనుభవరాహిత్యమైన మాటలే వీటన్నింటికి కారణమని, అది ఆయన స్వయంకృతాపరాధం అని కొందరు తేల్చేస్తున్నారు.