నిజానికి దర్శకుడు సుకుమార్‌ని తెలుగులో క్రియేటివ్ జీనియస్‌గా చెప్పవచ్చు. కానీ ఆయన చిత్రాలు సాధారణ ప్రేక్షకులకు అర్ధం కావు అనే విమర్శ కూడా ఆయనపై ఉంది. ప్రతి చిత్రంలోనూ తనదైన లెక్కలు చెబుతాడు ఈ లెక్కల మాస్టార్. ఇక దీనికి '1' (నేనొక్కడినే), 'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రాలు మంచి ఉదాహరణ. ఈయన తన ప్రతి సినిమా ముందు ఈ చిత్రం ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా ఉంటుందని, ఇందులో అర్ధం కాని లెక్కలు ఉండవని చెబుతాడు. కానీ ఆయన సినిమా చూస్తే మాత్రం ప్రతిసారి సుక్కు ఇచ్చిన మాట తప్పుతున్నాడని అర్ధమవుతోంది. ఆయన చిత్రాలు మల్టీఫ్లెక్స్ ఆడియన్స్, ఓవర్‌సీస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాయే గానీ సగటు సినీ ప్రేక్షకుడికి, మాస్, యాక్షన్ చిత్రాల అభిమానులకు మాత్రం తలలు బద్దలు కొట్టుకున్నా అర్ధం కావు. ఇక ఈయన ప్రస్తుతం రామ్‌చరణ్‌తో 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం గురించి కూడా ఆయన ఇది సింపుల్ కథ. ప్రతి ప్రేక్షకుడికి అర్ధమవుతుందని అంటున్నాడు. మరి అది నిజమో కాదో తెలియాలంటే ఈనెల 30వ తేదీ వరకు వెయిట్ చేయాల్సివుంది.
ఇక సుకుమార్ 'రంగస్థలం 1985' తర్వాత చేయబోయే చిత్రంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రం ద్వారా సుకుమార్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే రామ్‌చరణ్ ఓన్ బేనర్ కొణిదెల ఆర్స్ట్‌లోనే చిరంజీవి 'సై..రా..నరసింహారెడ్డి' తర్వాత ఓ చిత్రం చేస్తాడని అంటున్నారు. ఇటీవలే సుకుమార్ కూడా చిరంజీవికి 'గ్యాంగ్‌లీడర్' తరహాలో ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీని చెప్పడం, చిరంజీవికి నచ్చడం జరిగిపోయాయి. ఇక మరోవైపు 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత అల్లు అర్జున్ కూడా సుకుమార్‌తో ఓ చిత్రం చేయాలని భావిస్తున్నాడట. సుకుమార్ అల్లుఅర్జున్ నటించిన 'ఆర్య' ద్వారానే దర్శకునిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆతర్వాత వచ్చిన 'ఆర్య 2' మాత్రం ఆడలేదు. దాంతో బన్నీ సుకుమార్‌తో తదుపరి చిత్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాలు 'రంగస్థలం' విడుదలైన తర్వాత వచ్చే రెస్పాన్స్, మరీ ముఖ్యంగా మాస్, యాక్షన్ ప్రేమికులను ఎంతగా ఆకట్టుకుంటుంది? అనే పాయింట్ మీదనే చిరు, బన్నీలు నిర్ణయం తీసుకోనున్నారు. మరి సుకుమార్‌తో చేయాలని భావిస్తున్న చిరు, బన్నీలలో ఎవరు ఆయనకు ఓకే చెబుతారో వేచిచూడాల్సివుంది....!