రాజకీయాలంటే మామూలు కాదు.. అందునా నేటి కాలంలో రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. ఓ పార్టీని నడిపించాలంటే కోట్లాది రూపాయల డబ్బు ఉండాల్సిందే. మనీ పాలిటిక్స్ బాగా పెరిగిపోయాయి. ఎమ్మెల్యే సీటుకి 25 కోట్లు, ఎంపీ సీటుకి 50 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఇచ్చే విరాళాలతో నడుస్తుంటాయి. అందులో కూడా పారదర్శకత ఉండదు. ఇక సినిమాలలో తెరపై మాత్రమే నటిస్తారు. కానీ రాజకీయాలలో నిజజీవితంలో కూడా 24 గంటలు నటిస్తూనే ఉండాలి. మాటల మాంత్రికులుగా తయారవ్వాలి. వెంకయ్యనాయడు అనే వ్యక్తి రాజకీయాలలో ఎన్నో శిఖరాలు అధిరోహించాడంటే తిమ్మిని బమ్మిని చేసే ఆయన వాక్చాతుర్యమే కారణం. ఇక ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌లు రాజకీయాలలోకి వచ్చినప్పుడు కూడా వారు సినిమాలలోలాగానే ఉద్వేగభరిత ఉపన్యాసాలు, వేషాలు, దుస్తులు, జీతం నెలకి రూపాయే.. రెండు రూపాయలకే కిలోబియ్యం.. ఇలా ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగారు. ఇక కేజ్రీవాల్ అన్నా హజారేని కూడా పక్కకి నెట్టి ఢిల్లీ పీఠం దక్కించుకున్నాడు. కానీ మన జయప్రకాష్ నారాయణ్ మాత్రం రాజకీయ పార్టీని స్థాపించి సక్సెస్ కాలేదు. గ్రూప్స్‌లో ఇద్దరు ఐఏయస్, ఐఆర్‌ఎస్‌లు అయినా కూడా ఐఏయస్‌ని నమ్మని ప్రజలు ఐఆర్‌ఎస్‌ని నమ్మారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగమేనని చెప్పాలి, అది చేతకాకనే చిరంజీవి పాలిటిక్స్‌లో రాణించలేకపోయాడు. ముక్కుసూటిగా మాట్లాడుతాడు అనే పేరున్న పవన్‌కి వచ్చే ఎన్నికల్లో ఇదే మైనస్ పాయింట్ కానుంది.
ఇక రాజకీయాలలో కమల్‌లా మరీ ఆవేశంగా ఉండరాదు. రజనీలా మరీ సౌమ్యంగా ఉండరాదు. మద్యస్తంలో జయలలిత, వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి తరహాలో ఉంటేనే పాలిటిక్స్‌లో రాణిస్తారు. ఇందులో చంద్రబాబుది కొట్టిన పిండి. ఇక విషయానికి వస్తే ఇటీవల అన్ని లేడీ ఓరియంటెడ్ పవర్‌ఫుల్ మూవీస్ చేస్తోన్న బాలీవుడ్ నటి కంగనా రౌనత్ త్వరలో రాజకీయాలలోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఝాన్సీ లక్ష్మీభాయ్ బయోపిక్‌గా రూపొందుతున్న 'మణికర్ణిక'లో నటిస్తోంది. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె త్వరలో మోదీని కలవనుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా కంగనారౌనత్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది. రాజకీయం అనేది అద్భుతమైన రంగం. కానీ ఆ రంగం గురించి అందరు తప్పుగా అనుకుంటూ ఉంటారు. నాకు రాజకీయ నాయకుల ఫ్యాషన్ సెన్స్ నచ్చదు. ఇక నేను రాజకీయాలలోకి వస్తున్నానని వార్తలు వస్తున్నాయి. నేను వేసుకునే దుస్తులు, మాట్లాడే తీరు చూసి ఏ పార్టీ కూడా నన్ను చేర్చుకోదు. నా ప్యాషన్, నా అభిప్రాయాలకు అడ్డు చెప్పనంటే రాజకీయాలలోకి రావడానికి నేను రెడీ. నేను మోదీ అభిమానిని, ఆయన తన జీవితాన్నిగెలిచిన విధానం స్ఫూర్తిదాయకం. ఓ చాయ్‌వాలా ప్రధాన మంత్రి అయ్యారంటే అది ఆయన గొప్పతనం కాదు. మన ప్రజాస్వామ్య గొప్పతనం. నేను భారతదేశంలో పుట్టాను. అదే నాకు గుర్తింపు. భారతదేశం అభివృద్ది చెందకపోతే నేనూ ఏమి సాధించలేను అని రైజింగ్ ఇండియా సెమ్మిట్‌లో పేర్కొంది.