మీడియాలో వార్తలుగా వచ్చేవన్నీ కేవలం గాసిప్స్‌గా కొట్టిపారేయడానికి లేదు. ఏదో ఒక ఆధారం ఉంటేనే వార్తలు బయటికి వస్తాయి. వీటిల్లో చాలా భాగం నిజమవుతూనే ఉంటాయి. ముఖ్యంగా యూనిట్‌లోని వారే తమ సినిమాల పబ్లిసిటీ కోసం మీడియాకు లీక్‌లివ్వడం కూడా సహజమే. అయితే ఇలాంటి కొన్ని వార్తలు మాత్రం నిజం కాకుండా పోతాయి. దానికి అనేక కారణాలు ఉంటాయి. ముందుగా ప్రజల, ప్రేక్షకుల పల్స్, రెస్పాన్స్ తెలుసుకోవడానికి యూనిట్టే కొన్ని వార్తలను లీక్ చేసి, జనాల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే దానినే కన్‌ఫర్మ్ చేయడం, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తే... అబ్బే అవన్నీ గాలి వార్తలు అని అంటూ ఉండటం చూస్తాం. ఇక సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా 'యాత్ర' అనే టైటిల్‌తో ఓ చిత్రం రానుందని వార్తలు వస్తున్నాయి. 'ఆనందో బ్రహ్మ' చిత్రానికి దర్శకత్వం వహించిన మహి. వి.రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు స్క్రిప్ట్‌ని రెడీ చేస్తున్నాడు. ఈ విషయం మీడియాలో వచ్చిన వెంటనే దర్శకుడు మహి రాఘవ మాత్రం స్క్రిప్ట్ తయారవుతోంది. ఈ బయోపిక్‌ని తీసేది నిజమేనని, కానీ మమ్ముట్టి, నాగార్జున, విజయమ్మ పాత్రకి నయనతార వంటి వారిని సంప్రదిస్తున్నామని చెప్పడం మాత్రం తప్పు. నేను చెప్పేదాకా ఇలాంటి వార్తలు రాయవద్దని కోరాడు.
అయితే ఇప్పుడు ఇదే చిత్రం మీద మరో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిగా మమ్ముట్టి, విజయమ్మగా నయనతార నటిస్తున్నారని, ఇక జగన్ పాత్రను హీరో సూర్య చేయనున్నాడని వార్తలు మొదలయ్యాయి. అంటే జగన్‌గా సూర్య నటిస్తే ఆయన నయనతారకు కొడుకుగా నటించాల్సి వస్తుంది. అందునా వైఎస్ జీవితం అనేది కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే తప్ప ఇతర భాషా నటీనటులను వారు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఇక ఈ పుకారుకి కారణం ఏమిటంటే.. జగన్‌కి చెందిన భారతి సిమెంట్స్‌కి సూర్య అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఇటీవలే జగన్ చేపట్టిన పాదయాత్ర సక్సెస్ కావాలని ఓపెన్‌గా కోరుకున్నాడు. దాంతోనే ఈ సినిమాలో సూర్య పేరు కూడా తెరపైకి వస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో వేచిచూడాల్సి వుంది. ఇక ఈ చిత్రాన్ని విజయ్ జల్లా, శశిదేవర్ రెడ్డిలు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇక గతంలో వైఎస్ మరణించిన వెంటనే వర్మ 'రాజు గారు పోయారు' చిత్రం, పూరీ కూడా వైఎస్ బయోపిక్ తీస్తామని చెప్పి మౌనంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే.