పెద్దలను, లేదా ఏదైనా వేడుక, పుట్టినరోజు వంటివి జరుపుకుంటున్న పెద్దల వద్దకు ఉత్తచేతితో వెళ్లకూడదని, పండ్లు, పూలమాలలు, శాలువాలు తీసుకొని పోవడం మన ఆనవాయితీగా వస్తోంది. అది ఆయా పెద్దలకు మనం ఇచ్చే గౌరవం. ఇక నాడు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి, వాజ్‌పేయ్, పివి నరసింహారావు వంటి వారు తమ పుట్టిన రోజులకు, తమని కలవడానికి వచ్చేటప్పుడు శాలువాలు, పూల మాలలు, పుష్పగుచ్చాలు తేవద్దని చెప్పేవారు. అసలు శాలువానే ఎందుకు వచ్చిందంటే పెద్దలను కలిసే వారిలో గొప్పవారు ఉంటారు. పేద వారు ఉంటారు. గొప్పవాళ్లు ఖరీదైన బహుమతులు తెచ్చి, పేద వారు తక్కువ ఖరీదు ఉన్న గిఫ్ట్‌లను తెస్తే ఏదో తెలియని ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అందుకే అందరికీ అందుబాటులో ఉన్న శాలువాని ప్రజలకు మన పెద్దలు నేర్పారు. ఇక తాజాగా మోహన్‌బాబు 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు సోషల్‌మీడియా ద్వారా ఓ సందేశం ఇచ్చారు.
పూలమాలలు, పుష్పగుచ్చాలు తేవద్దని ఆయన ట్వీట్ చేశాడు. వాటి బదులు ఏవైనా మొక్కలు తెచ్చి గిఫ్ట్‌గా ఇస్తే తనకి అంత కంటే ఎక్కువ సంతోషమని, అలాంటి కానుక తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వెల్లడించాడు. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు మోహన్‌బాబు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే దీనితో పాటుగా ఆయన కూడా వైఎస్, వాజ్‌పేయ్, పివి నరసింహారావుల తరహాలో శాలువాలు తెచ్చినా అవి చేనేత శాలువాలే తేవాలని చెప్పి ఉంటే చేనేత కార్మికులకు సాయం చేసినట్లుగా ఉండి ఉండేది. లేక వాజ్‌పేయ్, వైఎస్ తరహాలో తనకి వచ్చిన శాలువాలన్నింటినీ స్వీకరించి ఆ తర్వాత వాటిని వృద్దుల, అనాథ ఆశ్రమాలలో ఇచ్చి ఉంటే అది సద్వినియోగం అయివుండేది. ఏదిఏమైనా మోహన్‌బాబు నిర్ణయాన్ని మాత్రం ప్రశంసించాల్సిందే....!