మొత్తానికి జనసేనాని తన రాజకీయ ప్రస్థానంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన చంద్రబాబుని కలిస్తే చంద్రబాబుతో లాలూచీ ఉందని వైసీపీ, లోకేష్ విమర్శిస్తే జగన్‌ని ఎందుకు విమర్శించలేదు? ఆయన జగన్‌కి వైసీపీకి అనుకూలమని ఇలా ప్రజలు కూడా సందిగ్దంలో ఉన్నారు. పవన్ భావాలు మంచివే కావచ్చు గానీ వాటిని ఆయన వెల్లడిస్తున్న సమయం, సందర్భంగా, ప్రసంగాలలో సమతుల్యత కోల్పోతున్నాడని చెప్పవచ్చు. ఆయన స్టాండ్ ఏమిటో మాత్రం జనాలకు అర్ధం కావడం లేదు. ఇక తాజాగా మాత్రం పవన్ తన స్టాండ్‌ని స్పష్టం చేశాడు. తాను ఇక టిడిపి, వైసీపీలకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. చంద్రబాబు ప్రభుత్వంపై తాను చేసిన విమర్శలను తాను చాలాకాలం కిందటే చంద్రబాబుని కలసినప్పుడు ఆయనకే సూటిగా చెప్పాను. ప్రత్యేకహోదా ఇవ్వకుంటే మోదీకి, ప్రత్యేకహోదా తేలేకపోతే తమకి మనుగడ లేదని బాబుకి కూడా తెలుసనని వ్యాఖ్యానించాడు.
ఇక ఈమధ్య కాలంలో తాను ఎక్కువగా దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం గురించి మాట్లాడానని, దాంతో పలువురు తనని విమర్శించారని, దేశసమగ్రతకు ఈ వ్యాఖ్యలను ముప్పుగా చెప్పారని, కానీ నేడు మాత్రం దక్షిణాది పార్టీలు, సీఎంలందరూ నేను చెప్పిన విషయం నిజమేనని వెల్లడిస్తున్నారని పవన్ స్పష్టం చేశాడు. తనకి జగన్ అంటే, బాబు అంటే అభిమానం ఉందని, కానీ రాజకీయాలలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని, ఎన్నికల్లో జగన్‌ని కూడా టార్గెట్ చేయడం ఖాయమంటున్నాడు. ఇక మంగళగిరి వద్ద అటవీ భూములను డీనోటిఫై చేయించి రాజధాని కడతానని తాను చంద్రబాబుని కలిసినప్పుడు ఆయన తనకు చెప్పారని, కానీ దానికి వ్యతిరేకంగా 33వేల ఎకరాల రైతుల భూములను ఆయన ఎందుకు సేకరించాడు? ఫాతిమా విద్యార్ధులకు మానవతా దృక్పథంతో న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని చెప్పుకొచ్చాడు అంటూ ఇక తనకు వామపక్షాలతో మొదటి నుంచి సాన్నిహిత్యం ఉందని, తాను కూడా అలాంటి భావాలే ఉన్నవాడిని కాబట్టే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్తాను తప్ప మరే పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పాడు. ప్రత్యేకహోదా కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తున్నానని చెప్పి మరోసారి రాజకీయ పార్టీలలో ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో ? అనేది ఊహకు రానివ్వకుండా తన పంధాని తేల్చిచెప్పాడు.