బాలీవుడ్‌లో అర్ధవంతమైన పాత్రలు, బరువైన వేరియేషన్స్ ఉన్న పాత్రలు, బయోపిక్స్‌లో ఆయా ఒరిజినల్ వ్యక్తుల జీవితాలలో నటించడమే కాదు.. జీవించడంలో విద్యాబాలన్‌కి మంచి పేరుంది. ఈమె తన చిత్రాల ద్వారా ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనే, కంగనా రౌనత్ వంటి వారితో పోటీ పడుతోంది. ఇక ఈమెకి ఇటీవల బాలకృష్ణ నటించి, నిర్మించనున్న తేజ 'ఎన్టీఆర్' బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రని పోషించమని అవకాశం వచ్చిన ఆమె నో చెప్పింది. దానికి కారణం ఏమిటో తెలియడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె ఇటీవల హఠాన్మరణం చెందిన అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్రలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీదేవితో తాను ఓ చిత్రం తీయాలని కథ కూడా రెడీ చేసుకున్నానని, బాలీవుడ్ దర్శకుడు హన్సల్‌మెహతా తెలిపాడు. శ్రీదేవిని పెట్టి చిత్రం చేయలేకపోయాననే బాధ తనని తీవ్రంగా బాధకి గురి చేస్తోందని, మరలా మరో శ్రీదేవి రావడం జరగని పని అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అందువల్ల శ్రీదేవి పాత్రకు సరైన నటీమణి దొరికితే తాను ఆమె బయోపిక్‌ని తీయడం ఖాయమని అంటున్నాడు. ఈ సినిమాని తీస్తే దీనిని ఆమెకే అంకితం ఇస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఆమె జీవితంపై ఖచ్చితంగా చిత్రం తీయగలనని, అందుకోసం కొందరు నటీమణులు తన మదిలో ఉన్నారని అంటున్న ఆయన తన మదిలో ఈ పాత్రకు విద్యాబాలన్‌ని తీసుకోవాలని ఉందని చెప్పేశాడు. ఇక ఇంతకు ముందు సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'డర్టీపిక్చర్'లో కూడా విద్యాబాలన్ అద్భుతంగా నటించింది. మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన ఆప్తమిత్రుదు, 'మిస్టర్ ఇండియా' దర్శకుడు శేఖర్‌కపూర్‌కి శ్రీదేవి బయోపిక్ బాధ్యతలు అప్పగించాడని, ఇది మాత్రం రెండు గంటల్లో శ్రీదేవి జీవితాన్ని చెప్పలేం కాబట్టి దీనిని డాక్యుమెంటరీగా రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం. ఇక వర్మ చెప్పినట్లు శ్రీదేవి అందం, అభినయం, డ్యాన్స్‌లు, ఇలా వీటన్నింటినీ పండించే నటి ఇప్పుడు ఎవ్వరూ లేరని చెప్పిన మాట మాత్రం వాస్తవం.