దేశవిదేశాలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న షోగా 'బిగ్‌బాస్'కి పేరుంది. దీనిని హోస్ట్ చేసే వారికే కాకుండా ఇందులో పార్టిసిపేట్ చేసేవారికి కూడా బాగా బ్రేక్ వస్తుంది. తమిళంలో ఓవియా, హిందీలో సన్నిలియోన్ నుంచి ఎందరో ఇందులో పాల్గొని క్రేజ్ తెచ్చుకుని వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇక స్టార్ మాలో తెలుగులో వచ్చిన 'బిగ్‌బాస్' సీజన్1కి ఎన్టీఆర్ హోస్టింగ్, మాటకారితనం ఎంత ప్లస్ అయ్యాయో చెప్పవచ్చు. కనిపించేది వారానికి రెండు సార్లైనా సరే ... ఆయన తనదైన శైలిలో బుల్లితెర వీక్షకులను మెప్పించి, ఈ ప్రోగ్రాంని కమల్‌హాసన్ కంటే ధీటుగా చేసి తెలుగులో తమిళం కంటే ఎక్కువగా సక్సెస్ చేశాడు. ఈయన 'జైలవకుశ' చిత్రం షూటింగ్ సమయంలోనే దీనిలో కూడా పాల్గొన్నాడు. కానీ ప్రస్తుతం ఆయన మరీ బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ చిత్రం కోసం, రాజమౌళితో రామచరణ్‌తో కలిసి నటించే మల్టీస్టారర్స్ కోసం మేకోవర్ సాధిస్తూ, పూర్తిగా ఆ రెండు ప్రాజెక్టల మీదనే మనసు పెట్టాడు. ఇక త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 'బిగ్‌బాస్' సీజన్ 2కి హోస్ట్ చేసే తీరికా, సమయం లేకపోవడంతో మరలా ఆయన్నే హోస్ట్ చేయమని స్టార్ మా అడిగినా ఆయన నో చెప్పాడు.
ఇక ఇందులో నాని, రానా, అల్లుఅర్జున్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి కానీ చివరకు స్టార్ మా నిర్వహకులు నేచురల్ స్టార్ నానినే ఫిక్స్ చేసుకున్నారు. వివాదాలు లేని కెరీర్, మాటకారితనంతో ఎవరినైనా బుట్టలో వేసే టాకింగ్ పవర్ ఉండటంతో నేచురల్ స్టార్ నాని అయితేనే ఎన్టీఆర్‌లా ఈ షోని రక్తికట్టించగలడని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఇందుకోసం ఆయనకు కూడా భారీ రెమ్యూనరేషన్‌ని ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈయన బుల్లితెరపై కూడా కనిపిస్తే సినిమాల ద్వారానే కాకుండా ఈ షో ద్వారా అన్నితరహా ప్రేక్షకులకు వీక్షకులకు దగ్గర కావచ్చని నాని కూడా భావిస్తున్నాడట. ఇక గతంలో నాని రేడియో జాకీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సైమా అవార్డ్స్ 2017కి ఆయన రానాతో కలిసి అద్భుతంగా హోస్టింగ్ చేయడం విశేషం. జూనియర్ వంటి వారు ఏడాదికి ఒక్క చిత్రం చేస్తూనే ఇంత బిజీగా ఉంటున్నారంటే ఏడాదికి మూడు చిత్రాలకు తగ్గకుండా వరుస చిత్రాలు చేసే నాని 'బిగ్‌బాస్' కోసం ఎంత సమయం కేటాయించగలడు? అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.