సోషల్‌మీడియా కింగ్, వివాదాలు, వితండవాదాలు, లాజిక్కులతో నిత్యం వార్తల్లో ఉండేవారిలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తర్వాతే ఎవరైనా. ఇక వర్మ అనే కాదు.. ఆయన స్కూల్‌లోని అందరిదీ అదే దారి, కృష్ణవంశీ, జెడిచక్రవర్తి, తేజ నుంచి అందరికీ ఆయనే ఆదర్శం. ఏ పాయింట్ మీదనైనా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసరడం ఆయన నైజం. అందుకే వివాదం అంటే కేరాఫ్ అడ్రస్ వర్మ.. వర్మ అంటే వివాదం. అదేంటో ఆయన మౌనంగా ఉన్నా కూడా అది పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన శిష్యురాలైన లేడీ వర్మ అలియాస్ రాధికాఆప్టే కూడా అదే దోవలో నడుస్తోంది. ఈమె సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద స్టేట్‌మెంట్స్ ఇవ్వడంలో ముందుంటుంది. సినిమాలలో నిండుగా కనిపించే ఆమె రియల్‌లైఫ్‌లో మాత్రం రెచ్చిపోతోంది. సాధారణంగా పలువురు హీరోయిన్లు వెండితెరపై గ్లామర్ డోస్‌తో కనిపించి, రియల్ లైఫ్‌లో పద్దతిగా ఉంటారు. కానీ రాధికా ఆప్టే మాత్రం అందుకు విరుద్దం.
ఇక సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్, అందునా ఓ రాజకీయ నాయకుడైన హీరో తనని లైంగికంగా వేధించాడు అని చెబుతూనే అది రజనీకాంత్ కాదని చెప్పింది. దాంతో ఆటోమేటిగ్గా అందరి అనుమానం ఓ టాప్ హీరోపై పడింది. ఇక ఈమె తాజాగా ఓ చిట్‌చాట్‌లో మీకు తెలిసిన దర్శక హీరోలలో ఎవరు రిటైర్‌మెంట్ తీసుకోవడం మేలని మీరు భావిస్తున్నారు? అన్న ప్రశ్నకు తడుము కోకుండా స్ట్రయిట్‌గా రాంగోపాల్‌వర్మ అని తెలిపింది. ఈమె చెప్పింది నిజమే అయినా ఈమెకి 'రక్తచరిత్ర'లో చాన్స్ ఇచ్చి తెలుగువారికి పరిచయం చేసిన వర్మ ఈమెకి గురువు వంటివాడు. మరి ఆమె మాత్రం తన గురువుపైనే సెటైర్ వేయడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.