ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ అండ్ స్టార్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. మాస్, యాక్షన్ చిత్రాల ప్రేక్షకుల పల్స్‌ని బాగా కనిపెట్టే ఆయన హీరోయిజాన్ని పీక్స్‌లో చూపిస్తున్నాడు. ఇక ఈయన తరహా చిత్రాలే చేసే ఈయన సీనియర్లు అయిన బి.గోపాల్, వినాయక్ వంటి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాంతో ఆ తరహా ఫుల్‌మాస్ ప్రేక్షకులకు విందు భోజనం పెట్టాలంటే ఇప్పుడు అందరికీ బోయపాటిశ్రీనునే కావాలి. ఇక 'సరైనోడు' వంటి కంటెంట్‌లేని చిత్రంతోనే భారీ కలెక్షన్లు వసూలు చేసేలా చేసిన బోయపాటి తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లతో తీసిన 'జయజానకి నాయకా'ని కూడా బాగానే తీశాడు. కానీ ఓవర్ బడ్జెట్, బాగా కాంపిటీషన్‌లో విడుదల చేయడం వల్ల ఈ చిత్రం అనుకున్న ఫలితం సాధించలేకపోయింది. మరోవైపు ఈయన అల్లుఅర్జున్, రామ్‌చరణ్ వంటి మెగా హీరోలనే కాదు.. అదే సమయంలో బాలకృష్ణ, ఎన్టీఆర్‌వంటి నందమూరిహీరోల ఫ్యాన్స్‌ని కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
మరోవైపు నందమూరి బాలకృష్ణ ఈనెల 29 నుంచి తేజ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్‌లో బిజీ కానున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని జూన్ నుంచి ప్రారంభించిన వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అదే సమయంలో దాదాపు అటు ఇటుగా బోయపాటి కూడా చరణ్ సినిమాని పూర్తి చేస్తాడు. ఈ ఇద్దరు ఫ్రీ అయిన తర్వాత వచ్చే ఏడాది సమ్మర్‌ని టార్గెట్ చేస్తూ బోయపాటి -బాలయ్య కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుందని సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా, లెజెండ్' చిత్రాలు చరిత్ర సృష్టించాయి. అలా చూసుకుంటే ఈ తాజా చిత్రం వీరిద్దరికి హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. బాలయ్య అభిమానులకు బోయపాటి అంటే ఎంతో ఇష్టం. వారు బాలయ్య 100వ చిత్రానికి కూడా బోయపాటిని పెట్టుకోవాలని కోరారు. ఇక నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీని కూడా బోయపాటికే ఇవ్వాలనే డిమాండ్ నందమూరి అభిమానుల నుంచి వస్తోంది. మరి ఏది ఏమైనా బోయపాటి, బాలయ్య కలిసి మూడోసారి ముచ్చటగా పనిచేయనుండటం నందమూరి అభిమానులకు తీపి విషయమేనని చెప్పాలి.