ఆమె నటించింది కొద్ది చిత్రాలే. తన పాత్ర బాగా లేకపోతే ఆమె నటించనని మొహమాటం లేకుండా చెబుతోంది. ఏదో పది ఇరవై నిమిషాలు కనిపించి నాలుగైదు పాటల్లో స్టెప్స్ వేసి, గ్లామర్‌షో చేసే పాత్రలకు ఆమె నో అంటుంది. ఏ సినిమా చేసినా అందులో బలమైన కీలకమైన పాత్రగా తన క్యారెక్టర్ ఉంటేనే ఆమె ఓకే చెబుతుంది. ఇదంతా 'మల్లార్' బ్యూటీ సాయిపల్లవి గురించి, తొలిచిత్రం 'ప్రేమమ్' తోనే దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న ఈమె తెలుగులో చేసిన మొదటి చిత్రం 'ఫిదా' తోనే ప్రేక్షకులను 'ఫిదా' చేసింది. ఆ తర్వాత నానితో 'నేను లోకల్' చిత్రం చేసినా అందులో వైవిధ్యం లేకపోవడంతో ఆమెపై నానితో పాటు అందరిపై విమర్శలు వచ్చాయి.
దాంతో ఇక త్వరలో చేయబోయే చిత్రాల విషయంలో మరింత కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈమె ప్రస్తుతం '2.0' వంటి చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో 'కరు' లో నటిస్తోంది. ఈచిత్రం తెలుగులో 'కణం'గా విడుదల కానుంది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తుండగా, గర్బస్థ శిశువు, తల్లి కావడం, తల్లి ప్రేమ వంటి విభిన్న షేడ్స్‌లో సాయిపల్లవి పాత్ర ఉంటుందని సమాచారం. ఈమెకి కోలీవుడ్‌లో ఇదే అరంగేట్ర చిత్రం కావడం విశేషం. ఈచిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ, ఆమె ఓపెన్‌గా చెప్పిన విషయం అందరిని విస్మయానికి గురి చేసింది. ఈ చిత్రం కథ, నా పాత్ర విన్నప్పుడు ఇది నాకు నచ్చలేదు. కానీ తర్వాత దర్శకులు ఈ కథని మా అమ్మకి వినిపించారు. మా అమ్మకి ఈ పాత్ర ఎంతో నచ్చింది. అందుకే ఇందులో నేను చేసేది అమ్మపాత్రే అయినా ఒప్పుకున్నాను. సినిమా బాగా వచ్చింది. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చింది.
ఇక ఈమె ఈ చిత్రం షూటింగ్ సమయంలో యూనిట్‌నే కాదు.. తనని కూడా ఎంతో ఇబ్బంది పెట్టిందని తాజాగా హీరో నాగశౌర్య సాయిపల్లవిపై మండిపడిన విషయం సంచలనంగా మారింది. అయినా ఇంత చిన్న వయసులో నాలుగైదు చిత్రాలు కూడా అనుభవం లేనప్పటికీ కూడా ఈమె తల్లి పాత్రను చేసిందంటే మెచ్చుకోవాల్సిందే.