తాజాగా పవన్ కళ్యాణ్ అందరు అనుకుంటున్నట్లుగా తాను టిడిపి అనుకూలం కాదని తన ఘాటైన విమర్శలతో సమాధానం చెప్పాడు. దాంతో ఆ వాదన చేసే వారు మింగలేక కక్కలేకున్నారు. తేలు కుట్టిన దొంగలా మౌనం వహిస్తున్నారు. వైసీపీనే ఇలాంటి ఆరోపణలు ఎక్కువ చేసింది. కానీ పవన్ టిడిపిపై విరుచుకు పడిన విషయంలో వైసీపీ కూడా అయోమయంలో పడి ఆయనకు కౌంటర్ ఇవ్వలేకపోతోంది. ఇక తమపై విమర్శలు చేసిన పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రత్యేకహోదా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తమను టార్గెట్ చేయడం ఏమిటి? మమ్మల్ని విమర్శిస్తే ఆయనకొచ్చే లాభం ఏమిటి? అని ప్రశ్నించాడు. అంటే ఎవరినైనా విమర్శించాలన్నా, తప్పుని ఎత్తిచూపాలన్నా, పొగడాలన్నా అలా చేసేవారికి ఏదో ఒక లాభం ఉండాలనేది చంద్రబాబు అంతరార్థంగా కనిపిస్తోంది. మమ్మల్ని విమర్శిస్తే వచ్చే లాభం ఏమిటి? అనే మాటల వెనుక అర్ధం ఏమిటి?
ఇక చంద్రబాబు తాము నిజాయితీగా ప్రత్యేకహోదాపై పోరాటం చేస్తున్నామని అంటున్నాడు. చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెట్టింది... ప్రత్యేక ప్యాకేజీనే చాలు అని ప్రజలను మభ్యపెట్టింది నిజం కాదా? ఏనాడైనా ఆయన ప్రత్యేకహోదాకి ప్రత్యేక ప్యాకేజీ సమానమని నిరూపించిన దాఖలాలు ఉన్నాయా? ఇక చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ, నాలుగేళ్లుగా మాలో కనిపించని అవినీతి పవన్‌కి ఇప్పుడే ఎందుకు కనిపిస్తోంది? అని ప్రశ్నించాడు. మరి నాలుగేళ్లుగా ఎన్డీయేలో సాగుతూ, కేంద్రానికి మద్దతు ఇచ్చిన టిడిపికి ఇంతకాలం గుర్తుకురాని కేంద్ర నిర్లక్ష్యం ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? ఎన్నికలు దగ్గరకు రావడమే కారణమా? అనేది ఆయన సమాధానం చెప్పాల్సివుంది. ఈ విషయంలో ఆయన తనను తాను సమర్ధించుకుంటూ నాలుగేళ్లుగా కేంద్రం ఏదో చేస్తుందని ఓపిక పట్టామని, ఏమీ చేయకపోవడంతో ఇప్పుడు పోరాడుతున్నామని చెప్పాడు. మరి అదే పవన్‌కి కూడా వర్తిస్తుంది కదా...! పవన్ కూడా టిడిపి ప్రభుత్వం మారుతుందని, అవినీతిని, ఇతర అప్రజాస్వామిక పనులను పక్కన పెడుతుందని మౌనంగా ఉండి నాలుగేళ్ల తర్వాత కూడా వారు మారకపోయే సరికే ఘాటు విమర్శలు చేశాడని ఎందుకు భావించకూడదు.
ఇక పవన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలు చేయనని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. దానికి ఉదాహరణగానే ఓటుకు నోటు నేడు అందరు చేస్తున్నదే కాబట్టి తాను కూడా మౌనంగా ఉన్నానని చెప్పాడు. మౌనంగా ఉన్నంత మాత్రాన అది తమ అద్భుత పాలనకు నిదర్శనమని భావించరాదు. మౌనంగా వెనుక తుఫాన్ భీభత్సం ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో ఏపీ ప్రజలు అలాగే ఉన్నారు.