ఏమాటకామాటే చెప్పుకోవాలి గానీ గత నాలుగేళ్లలో పవన్‌కళ్యాణ్ ప్రతి అడుగు చంద్రబాబునాయుడికి మద్దతుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. దోపిడీలో జగన్ సిద్దహస్తుడు కావడం, ఓ దోపిడీదారుడు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రభావం సమాజంపై ఉంటుందని కూడా పవన్ చెబుతూ వస్తున్నాడు. చంద్రబాబు సీనియర్ రాజకీయ నేత కాబట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆయనైతేనే న్యాయం చేయగలడని, పవనే కాదు.. సామాన్య ప్రజలు కూడా భావించడంతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఇక పవన్‌కి ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఒంటపడుతున్నాయని చెప్పవచ్చు. పొగిడితే నెత్తిన పెట్టుకునే వ్యక్తులే విమర్శిస్తే తీవ్ర ఎదురుదాడికి దిగుతారని పవన్‌కి అర్ధమై ఉంటుంది.
ఇక పవన్ చెప్పినట్లు ఏపీలో అవినీతి ఎంత స్థాయిలో వేళ్లూనుకుని పోయిందో కావాలంటే నిరూపించడానికి అందరు సిద్దంగా ఉన్నారు. ఎన్నడూ లేనంతగా తీవ్ర అవినీతి, పచ్చచొక్కాగాళ్లకు జన్మభూమి కమిటీలు, కులాల కార్పొరేషన్‌లలో అవినీతిపరులకు పట్టం కట్టడం వల్ల ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలు ప్రజల వద్దకు చేరడం లేదనే చెప్పాలి. ఇక పవన్ వ్యాఖ్యలపై టిడిపి నాయకులు, చంద్రబాబు, లోకేష్‌లతో సహా అందరు తీవ్రంగా మండిపడుతున్నారు. కానీ పవన్‌ని రామ్‌చరణ్ మాత్రం మెచ్చుకున్నాడు. నిజానికి ఇన్నేళ్ల కాలంలో పవన్ వాస్తవాలు మాట్లాడింది ఎక్కువగా ఈ సభలోనే అని చెప్పవచ్చు.
దీని గురించి రామ్‌చరణ్ బాబాయ్ ప్రసంగం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఫేస్‌బుక్‌లో ఆయన స్పందిస్తూ 'ఉత్తేజపరిచేలా, నిజాయితీగా ఉన్న గొప్ప ప్రసంగం, భవిష్యత్తులో అయినా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశిద్దాం..' అని పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. 'నిజం చెప్పాలంటే పవన్ ప్రసంగం మొదటిసారిగా నిజాయితీగా అనిపించింది. ఇక నీవు మెగా వరసత్వాన్ని ముందుకు తీసుకెళ్లు... బాబాయ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించడంలో బిజీగా ఉన్నారు' వంటి పొగడ్తలతో పాటు కొన్ని ఘాటైన విమర్శలు కూడా పవన్ మీద నెటిజన్లు చేస్తున్నారు.