తాజాగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని, మరీ ముఖ్యంగా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయడం ఎవరికి మింగుడు పడటం లేదు. నిన్నటివరకు విపక్షాలు పవన్‌ని టిడిపి భజన పార్టీగా పిలుస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ ఏకంగా చంద్రబాబు, నారాలోకేష్, వైఎస్‌జగన్, అరుణ్‌జైట్లీ వంటి అందరినీ ఘాటు వ్యాఖ్యలతో బిత్తరపోయే పని చేసేసరికి అందరికీ మరీ ముఖ్యంగా టిడిపి నాయకులు డిఫెన్స్‌లో పడిపోయారు. ఇక పవన్ నారా లోకేష్‌పై చేసిన విమర్శలను గురించి సీనియర్ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి ఘాటు పదజాలం వాడుతూ పవన్‌ని విమర్శించాడు. నిన్నటివరకు చంద్రబాబుని మించిన నాయకుడే లేడన్న పవన్ ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతాడు? నారా లోకేష్‌పై ఆయన ఎలా అవినీతి ఆరోపణలు చేస్తాడు? ఇలా చేసినందుకు ఆయనకు ఎంత ప్యాకేజీ వచ్చింది? నారాలోకేష్ అవినీతిని నిరూపించలేకపోతే ప్రజలే పవన్‌ని గుడ్డలూడదీసి కొడతారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టి టిక్కెట్లు అమ్ముకున్న మీరా మమల్ని విమర్శించేది అని విమర్శించాడు.
దీని మొత్తంలో మోత్కుపల్లి చెప్పిన దానిలో వాలిడిటి ఉన్న పాయింట్ కేవలం పీఆర్పీ పార్టీ టిక్కెట్లను అమ్ముకుంది? అనే విమర్శ తప్ప మిగిలినదంతా మోత్కుపల్లి అజ్ఞానంగా మాట్లాడుతున్నాడని అర్ధమవుతోంది. అయినా అన్న చేసిన దానికి తమ్ముడిని, ఎన్టీఆర్ చేసిన దానికి చంద్రబాబును, బాలయ్య దురుసు ప్రవర్తనకు చంద్రబాబును విమర్శిస్తే ఎలా? ఇక పవన్ వేరే పార్టీకి ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయావని అడిగాడు. మరి 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపిలకు పవన్ మద్దతు ఇచ్చినందుకు టిడిపి పవన్‌కి ఎంత ప్యాకేజీ ఇచ్చిందో ముందుగా మోత్కుపల్లి చెప్పాల్సివుంది. ఇక ఒకసారి ఒకరిని పొగిడినంత మాత్రాన, ఫలానా వ్యక్తి మంచి వాడు అని చెప్పినంత మాత్రాన జీవితాంతం అదే మాట మీద ఉండాలని లేదు. తాను మంచి వ్యక్తి అని చెప్పే వ్యక్తి మంచి చేస్తే మంచి చేశాడని, చెడు చేస్తే చెడు చేశాడని చెప్పడమే నిజమైన బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. అలాగని మంచి చేసినా తిట్టడం, చెడు చేసినా మెచ్చుకోవడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం.
మొత్తానికి ఎవరి విషయంలోనైనా మంచిని మంచి అని చెప్పుకుందాం.. చెడును చెడు అని ఒప్పుకుందాం.. అదే బాధ్యతాయుతమైన వ్యక్తి చేయాల్సిన పని అని మోత్కుపల్లి తెలుసుకోవాలి. పీఆర్పీ టిక్కెట్లు అమ్ముకున్న మీరా మాకు నీతులు చెప్పేది అని ఆయన ప్రశ్నిస్తే ఓటుకు నోటు, ఎన్నో స్టేలు తెచ్చుకున్న మీ నాయకుడా పవన్‌ని విమర్శించేది? అనే ప్రశ్నకూడా ముందుకు వస్తుందని ఆయన అర్ధం చేసుకోవాల్సివుంది...!