తెలుగులో అందం, అభినయం కలగలిసిన హీరోయిన్ అంటే ఇంద్రజ ఒకరు. ఆమె 'యమలీల, అమ్మదొంగా' వంటి పలు చిత్రాలలో నటించారు. కాగా ఆమెకి ఇష్టమైన చిత్రం మాత్రం గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'సొగసు చూడతరమా' అని చెప్పుకొచ్చింది. నా మీద నమ్మకంతో నాకు అలాంటి అవకాశం ఇచ్చిన గుణశేఖర్ గారికి రుణపడి ఉంటాను. ఇప్పటివరకు నేను అన్ని భాషల్లో కలిపి 80 చిత్రాల వరకు చేశాను. అన్నింటిలోకి 'సొగసుచూడతరమా'నే గ్రేట్. ఇక పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం అయ్యాను. నేను శ్రీకాంత్‌తో 'జంతర్ మంతర్'చిత్రం షూటింగ్ జరిగే సమయంలో దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన నాకోసమే వచ్చారని తెలిసి ఆశ్యర్యపోయాను. నాకు తెలుగు రాదు. అయినా ఎస్వీకృష్ణారెడ్డి గారు నాతో మాట్లాడుతుంటే ఊ కొట్టాను. చివరల్లో ఆయన నా చిత్రంలో నువ్వు నటిస్తున్నావు? అనడంలో ఆశ్చర్యపోయాను.
ఇక 'యమలీల' చిత్రంలో నేను హీరో తల్లిని ఇంట్లో నుంచి పంపించేయమని భర్తతో తగవు పెట్టుకుంటాను. కానీ హీరో మాత్రం నీవు అమ్మవైతే నీకు అమ్మగొప్పతనం తెలుస్తుంది.. నువ్వు కాదు.. నేనే ఇంటి నుంచి వెళ్లిపోతాను అని వెళ్తాడు. కానీ ఆ తర్వాత నా పాత్ర ఇక కనిపించదు. కానీ చివరలో అమ్మ గొప్పతనం చూసి నేను పశ్చాతాప పడి మరలా భర్త వద్దకు మారిన హృదయంతో వెళ్లేలా తీసి ఉంటే బాగుండేది. ఆ విషయంలో నేను నా పాత్రకు ప్రాధాన్యం లేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. ఇక నేను 'అమ్మదొంగా' చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు సాగర్ గారు పిలిస్తే షూటింగ్ స్పాట్‌కి వెళ్లాను. ఆయన మరీ చిన్నపిల్లలా ఉంది వద్దు అన్నారు. కానీ తర్వాత నాకే ఆ చాన్స్ ఇచ్చారు.
మొదటి రోజు హీరో కృష్ణ గారు చాలా సీరియస్‌గా ఉన్నారు. నా నటన ఆయనకు నచ్చడంలేదా? నాపై కోపమా? లేక ఆయన టైమింగ్‌ని నేను అందుకోలేకపోతున్నానా? అని బాధపడి ఏడ్చేశాను. అప్పుడు ఆయన మేకప్‌మేన్, మేనేజర్ వచ్చి ఆయన అంతే మేడమ్. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు అని చెప్పడంతో స్థిమిత పడ్డానని చెప్పుకొచ్చింది.