రాజమౌళికి ఎన్టీఆర్‌కి అంతకు ముందు 'స్టూడెంట్ నెంబర్ 1' అనే హిట్ ఉండి ఉండవచ్చు. ఇక 'ఆది'తో ఎన్టీఆర్ మాస్ హీరోగా వెలిగి ఉండవచ్చు. కానీ యంగ్ టైగర్ కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ చిత్రంగా, టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన చిత్రంగా 'సింహాద్రి'కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాదే రాశాడు. మొదట హీరో బాలకృష్ణ కోసం ఈ కథను తయారు చేశారు. బాలకృష్ణకి కూడా స్టోరీ నచ్చింది. దాంతో డెవలప్ చేయడానికి విజయేంద్రప్రసాద్‌తో పాటు పరుచూరి బ్రదర్స్ కూడా పనిచేశారు. ఆర్డర్ పూర్తయి డైలాగ్స్ రాసే సమయానికి బాలకృష్ణ ఆల్‌రెడీ 'రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి' చేశాను కదా..! మరలా అలాంటి చిత్రమే ఎందుకు అనడంతో పక్కన పెట్టేశారు.
ఆ సమయంలో బాలకృష్ణ 'వంశానికొక్కడు' చిత్రం చేస్తున్నాడు. చివరకు ఈ 'సింహాద్రి' సబ్జెక్ట్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లడం, బ్లాక్‌బస్టర్ కావడం జరిగిపోయాయి. ఇలా ఈ చిత్రంలో పరుచూరి బ్రదర్స్ భాగస్వామ్యం కూడా ఉంది. ప్రతి బియ్యపు గింజపై ఎవరి పేరు ఎలా రాసి ఉంటుందో కథ విషయంలో కూడా అంతే. ఇదే చిత్రాన్ని తమిళంలో విజయ్‌కాంత్ హీరోగా సురేష్‌కృష్ణ దర్శకత్వంలో 'గజేంద్ర'గా రీమేక్ అయింది.