తెలుగులో 'దేవదాసు'తో పరిచయమై యంగ్‌స్టార్స్ అందరి సరసన నటించి మెప్పించి, కోటి రూపాయల పారితోషికం తీసుకున్న నటి ఇలియానా. ఈ నడుం సుందరి ఈమద్య సినిమా ఫీల్డ్‌పై బాగా మండిపడుతోంది. పెద్దగా అవకాశాలు రాని ఫస్ట్రేషనో ఇక నిజాలే చెబుతుందో గానీ ఇటీవల దక్షిణాది సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతూ, తనను సౌత్‌లో 'అందాల వస్తువు'గానే భావించారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక తాజాగా ఆమె అజయ్‌దేవగణ్ పుణ్యమా అని ఆయన చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌తో నటించిన 'రైడ్' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.
ఈమె తాజాగా లైంగిక వేధింపుల గురించి ఘాటైన వ్యాఖ్యలే చేసింది. అవకాశం కోసం పడక సుఖం అడిగారు అని ఓపెన్‌గా చెప్పే నటీమణులకు కెరీర్ ముగిసిపోతుందట కదా? అన్న ప్రశ్నకు అలా ప్రశ్నించకపోవడం పిరికితనం అవుతుంది. 'అవకాశాలకు పడక సుఖం' గురించి మాట్లాడితే కెరీర్ ఎండ్ అవుతుందనే విషయం నిజమే. దీనికి సంబంధించి చాలా ఏళ్ల కిందట దక్షిణాదికి చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ నిర్మాత నుంచి తనకు ఎదురవుతున్న వేధింపులను చెప్పి సలహా ఇవ్వమని కోరింది. అందుకు నేనేమీ సలహా ఇవ్వలేకపోయాను. విషయాన్ని ఆమె ఇష్టానికే వదిలేశాను. నేను మాత్రం లైంగిక వేధింపులు, దోపిడీకి పూర్తి వ్యతిరేకమని తేల్చిచెప్పింది.
ఇక ఎవరైనా అలాంటి విషయాలను బహిర్గతం చేస్తే అందరు వారికి బాసటగా నిలచి, అండగా ఉండాలని కోరింది. ఇక నా వ్యక్తిగత జీవితం గురించి నేను కొంత వరకే చెబుతాను.. మాట్లాడతాను. అంతకు మించి ఎక్కువగా నా పర్సనల్ విషయాలు ముచ్చటించను. సోషల్‌మీడియాలో కొంతవరకు విషయాలను మాత్రమే పంచుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక ఓ విలేకరి కాస్త అత్యుత్సాహం చూపి, ఇప్పుడు మనం సూపర్‌స్టార్ అజయ్‌దేవగణ్, ఇలియానా డిసౌజాతో ఉన్నాం.. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం అన్నాడు.
ఒకసారి కాదు... రెండో సారి కూడా తనను ఇలియానా డిసౌజా అని పిలవడంతో ఇలియానా మండిపడింది. ముందుగా కాస్త హోమ్‌వర్క్ చేసుకుని ఇంటర్వ్యూ చేయాలి. ముందు నా పేరు సరిగా పలకడం నేర్చుకో.. ఇక ఒక వ్యక్తిని సంబోధించేటప్పుడు విశేషణాలకు జోడించడం మర్యాద అంటూ అజయ్‌దేవగణ్‌ని మాత్రం సూపర్‌స్టార్ అని, తనని ఏకవచనంతో ఇలియానాగా పేర్కొన్న జర్నలిస్ట్ పరువును నిలువునా తీసింది....!