నేటి జనరేషన్ వారు నువ్వు ఎంత అంటే నువ్వెంత అనే రకంగానే ఉంటున్నారు. మమ్మల్ని ఒక మాట అంటే మేము నాలుగు మాటలు బదులు చెబుతాం.. మీరేమైనా తోపులా.. అంటూ తమదైన శైలిని చూపిస్తున్నారు. ఇక సినిమా ఫీల్డ్‌లో కూడా నేటితరం వారు తమను ఎవరైనా విమర్శించిన, లేదా కామెంట్స్ చేసిన ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. కానీ పాపం తమన్ మాత్రం ఈ విషయంలో పెద్దరికంగా వ్యవహరించాడు. ఇటీవల మంచు మోహన్‌బాబు 'గాయత్రి' అనే చిత్రంలో నటించాడు. ఇది ఫ్లాప్ అయింది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. 'గాయత్రి' సినిమా విడుదల సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను గానీ ఆయనతో పనిచేయడం చాలా కష్టం. టాలెంట్ ఉంది కానీ బహు బద్దకస్తుడు...అంటూ మాట్లాడాడు.
ఇలాంటివి ఏమైనా ఉంటే వారిలో వారు డిస్కస్ చేసుకోవాలి గానీ మీడియా ముందు తమన్‌ని అవమానించేలా, ఆయన్ను పెట్టుకోవాలని భావించే దర్శకనిర్మాతలు భయపడేలా బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేమంటే మోహన్‌బాబు తాను ముక్కుసూటి మనిషిని అంటాడు. అదే ఎవరైనా ఈ వయసులో మోహన్‌బాబుకి సినిమాలెందుకు? అని ఓపెన్‌గా కామెంట్ చేస్తే మోహన్‌బాబుకి ఎంత అవమానం? కానీ తమన్ మాత్రం దీనిని రెట్టించలేదు. వెంటనే స్పందించలేదు. సినిమా ఫ్లాప్ అయిందని మోహన్‌బాబుని కామెంట్ చేస్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో గానీ తమన్ మాత్రం హుందాగా ఇంతకాలానికి నోరు విప్పాడు.
'గాయత్రి' చిత్రం మ్యూజిక్ ఇవ్వడం లేటు కావడానికి కారణం కేవలం ఆ సినిమాకి మంచి మ్యూజిక్ ఇవ్వాలనే. కాబట్టే ఎక్కువ సమయం తీసుకున్నాను. ఇక అదే వారంలో విడుదలైన 'ఇంటెలిజెంట్, తొలిప్రేమ' చిత్రాలకు కూడా నేనే సంగీత దర్శకుడిని. ఇలా నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. అయినా మోహన్‌బాబు వంటి సీనియర్ నన్ను తిట్టినా ఆశీర్వాదంగా తీసుకుంటానని సుతిమెత్తగా మోహన్‌బాబుకి ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటించాడు. ఇక 'భాగమతి, తొలిప్రేమ'ల తర్వాత తమన్ మరలా పూర్వవైభవం తెచ్చుకున్న సంగతి తెలిసిందే...!