దేశంలోనే గొప్ప ఆర్టిస్టులుగా, ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసేవారిగా, పెద్దగా అందగాళ్లు కాకపోయినా తమను మించిన ధీటైన నటులు లేరని నిరూపించుకున్న వారిలో నానా పటేకర్, ఓంపురి, పరేష్‌రావల్, కోటశ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, నాజర్ వంటి ఎందరినో చెప్పవచ్చు. వీరు తమ నటనతో ఇండియన్ సినిమాని కొత్త పుంతలు తొక్కించి, విదేశీయులు కూడా ఆ చిత్రాలు చూస్తే ఆహా ఎంత గొప్పనటుడు అనిపించేలా భారతీయులుగా గుర్తింపు తెచ్చారు. వారి నటనను కూడా మాటల్లో కూడా వర్ణించడం వీలుకాదు.
ఇక నానా పటేకర్ విషయానికి వస్తే ఆయన నటించిన చిత్రాల జయపజయాలు పక్కన పెడితే ఆయన నటునిగా ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు. ఆయన వల్ల చిత్రాలకు నిండుదనం వచ్చిందే గానీ సినిమాల వల్ల ఆయనకు నిండుతనం రాలేదు. 'పరిందా' వంటి చిత్రాలలో ఆయన నటన చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇక ఓంపురి తెలుగులో ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో ఇండియాలో మానవహక్కుల మీద వచ్చిన మొదటి చిత్రంగా పేరున్న రేవతి నటించిన 'అంకురం' చిత్రంలో నటించడం గొప్పగా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు నానా పటేకర్ తొలిసారిగా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం, ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుండటంతో అందరి చూపు ఆ చిత్రంపైనే ఉంది. అదే రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రం. ఇందులో నానా పటేకర్ విలన్‌గా.. సారీ.. ప్రతినాయకునిగా నటిస్తున్నాడు. మొదట ఈ చిత్రంలో తాను నటించాలని అనుకోలేదని, కానీ రజనీ సార్ స్టోరీ చెప్పి.. 'ఈ చిత్రంలో నేను కనిపించను.. నువ్వే కనిపిస్తావు' అని చెప్పడం నిజంగా రజనీ గొప్పతనమని తెలిపాడు. కేవలం తాను 'కాలా' చిత్రాన్ని రజనీ సార్ కోసమే చేశానని గర్వంగా ప్రకటించాడు.
ఇక నానా పటేకర్ వ్యక్తిగత జీవితంలో కూడా పెళ్లి లేకుండా ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ మహారాష్ట్రలోని రైతుల కుటుంబాలకు తన సంపాదన అంతా ఇచ్చేస్తున్నాడు. ఇక 'కాలా' విషయానికి వస్తే రంజిత్‌పా దర్శకత్వంలో 'కబాలి' తర్వాత వస్తున్న రజనీకాంత్ 'కాలా' చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. దీనిని రజనీ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ తన సొంత వండర్ బార్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలోని నటీనటులను చూస్తే ఇది సహజత్వానికి దగ్గరగా ఉన్న చిత్రం అనిపిస్తోంది.