ఈ మధ్య తరచుగా జగన్, వైసీపీ నాయకులు పవన్‌ది 'జనసేన' కాదు.. టిడిపి 'భజన' సేన. చంద్రబాబు మీద ఏదైనా విమర్శ వస్తే, ఆయనకి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే చాలు వెంటనే పవన్ రంగంలోకి దిగి ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తాడని విమర్శిస్తున్నారు. వాటికి పవన్ తాజాగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. చంద్రబాబు చెప్పినట్లుగా నేను నడుస్తున్నానని అంటున్నారు. మరి జగన్.. మోదీ మాట ప్రకారం నడుస్తున్నాడా? జగన్‌ని మోదీ నడిపిస్తున్నాడా? నన్ను చంద్రబాబు మాత్రమే నడిపిస్తున్నాడని జగన్ ఎందుకు అనుకోవాలి? మోదీ నన్ను నడిపిస్తున్నట్లుగా భావించవచ్చు కదా...! నేనేమి ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయాలలోకి రాలేదు. రాజకీయాలంటే సులభం కాదని నాకు కూడా తెలుసు. నేను ఎవరి ఆస్తులు దోచుకోలేదు. ఎవరి సొమ్ముని కొల్లగొట్టలేదు.. అంటూ పరోక్షంగా జగన్‌పై సూటి విమర్శలు గుప్పించారు.
నా అభిప్రాయాలను దాచుకోను. సమస్యల నుండి పారిపోను. మానాన్న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయనేమీ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. 2007 నుంచి రాజకీయాలలో ఉన్నాను. కానీ దొడ్దిదారిన పదవులు చేపట్టడం నాకిష్టం లేదు. షార్ట్‌కట్ విధానాలు నాకు నచ్చవు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మొదటి నుంచి గొంతు విప్పుతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక కొందరు వైసీపీ నేతలు పవన్ ఆర్ధికంగా మంచి స్థితిలో లేనంటున్నాడు. తన స్టాఫ్‌కి, ఆఫీసుకి కూడా అద్దె, జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నానని అంటున్నాడు. ఇక పవన్ తాజాగా అమరావతిలో కడుతున్న ఇల్లు, కార్యాలయం స్థలం విలువే 25 కోట్ల వరకు ఉంటుంది. ఇక నిర్మాణం కూడా చేపడితే కేవలం నిర్మాణానికే 50కోట్ల వరకు ఖర్చవుతుంది. అంటే మొత్తంగా 75 కోట్లు ఆయనిక ఎక్కడివి? అని ప్రశ్నిస్తున్నారు.
దానికి కూడా పవన్ సమాధానం చెప్పాడు. తానేమీ పేదరికంలో ఉన్నానని చెప్పలేదని, సంపాదించాను. మరలా పోగొట్టుకున్నాను. మరలా సంపాదించాను. అవసరం వస్తే ఆస్తులు ప్రకటిస్తానని జగన్‌కి పరోక్షంగా సవాల్ విసిరాడు.