వచ్చిన సాంకేతికను ముందు బాగా మంచికి వాడుకోవడం మానేసి దానిని దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలు ముందుంటున్నాయి. నాడు వేణుమాధవ్ నుంచి పలువురిని బతికుండగానే చంపేసిన ఘనత ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలకు ఉంది. దాంతో వారు బయటికి వచ్చి మేము బతికే ఉన్నాం..మమ్మల్ని మీ టీఆర్పీలు, వ్యూస్ కోసం చంపేయవద్దని వేడుకునే దాకా పరిస్థితి వచ్చింది. ఇక ఇటీవల హీరో శ్రీకాంత్‌కి భారీ యాక్సిడెంట్ జరిగిందని, ఆయన విషమ పరిస్థితులలో ఉన్నాడంటూ యూట్యూబ్‌లు, ఫేస్‌బుక్‌ల నిండా వార్తలే వచ్చాయి. దాంతో శ్రీకాంత్ మీడియా ముందుకు వచ్చి మరీ అలా రాసిన వారిపై మండిపడ్డాడు. ఇక తాజాగా సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడైన ఆర్.పి.పట్నాయక్ కూడా ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా రావడం చూసి తాను బూతులు మాట్లాడనని, కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోందని, అలా రాసి సొమ్ము చేసుకునే వారు నిజంగా ఓ తల్లిదండ్రులకు పుట్టిన వారేనా అని తన బాధను వ్యక్తం చేశాడు.
ఇక తెలుగులో తేజ సజ్జాతో మరో సజ్జా అనే పేరుతో ఇంకో బాలనటుడు ఉన్నాడు. ఇందులోని ఓ బాలనటుడు హృషీకేశ్‌లో నదిలో కొట్టుకుపోయి మరణిస్తే అందరు మరో బతికున్న బాలనటుడి ఫొటోను ముద్రించి వార్త రాశారు. దాంతో ఈ బతికున్న సజ్జా తన తల్లిదండ్రులతో కలిసి మరీ మీడియా ముందుకు వచ్చి తన బాధను వెల్లడించుకున్నాడు. ఇక తాజాగా సీనియర్ నటుడు, కె.విశ్వనాథ్ నుంచి బాపు వరకు అందరికీ ఎంతో గొప్ప స్నేహితునిగా పేరు తెచ్చుకున్న వంకాయల సత్యనారాయణ వైజాగ్‌లో మరణించాడు. ఈయన 'సీతామాలక్ష్మి' నుంచి ఎన్నో చిత్రాలలో గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. కానీ యూట్యూబ్ చానెల్స్ గానీ, సోషల్ మీడియాలోని వారు గానీ దానిని క్లారిఫై చేసుకుని, క్రాస్ ఎగ్జామిన్ చేసుకోకుండా వంకాయల సత్యనారాయణ బదులు కైకాల సత్యనారాయణ మరణించాడని పోస్ట్‌లు, సంతాప సందేశాలు పెట్టి నానా హడావుడి చేసి, తర్వాత నాలుక కరుచుకున్నారు.
ఇక ఇదే ఒకప్పటి మీడియా ఎలా ఉండేందంటే ఓ సారి ఈనాడు దినపత్రికకు ఓ లేడీ డాక్టర్ మరణిస్తే శ్రద్దాంజలి ఘటిస్తూ ఓ యాడ్ వచ్చింది. కానీ ఆ యాడ్‌లో పత్రికలో పనిచేసిన వారు అదే పేరున్న మరో డాక్టర్ ఫొటోని వాడారు. కానీ ఆ ఫొటో చూసి బతికున్న ఆమె నవ్వుకుని నన్ను బతికుండగానే నా నరదిష్టి పోగొట్టారు అని వ్యాఖ్యానించింది. ఆమె కోపం వ్యక్తం చేయకపోయినా ఇదే పాయింట్ మీద ఈనాడు నుంచి ముగ్గురు ఉద్యోగులను తీసివేశారు. నాటి మీడియాకి నేటి మీడియాకి ఉన్న తేడా అదే....!