లైంగిక వేధింపులు కేవలం వయసులో ఉన్న ఆడవారి మీదనే జరుగుతాయని భావించడం అవివేకం. అవి ఏ వయసు వారికైనా, స్త్రీ పురుష బేధం లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక దీనిని సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తనదైన శైలిలో విశ్లేషించింది. చిన్నారులు ఎదుర్కొంటున్న వేదింపులపై ఆమె వరుస ట్వీట్స్ చేసింది. తాను కూడా ఇటీవల ఓ వేడుకలో ఇలాంటివి ఎదుర్కొన్నానని చెప్పింది. ఆ వేడుకలో ఒక వ్యక్తి తన చేతులతో తనని ఎక్కడెక్కడో తాకాడని, చివరికి తన వక్షోజాలను కూడా పట్టుకోవాలని చూశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇది కేవలం మహిళలకే కాదు.. మగవారికి కూడా ఎదురవుతుంటాయని, ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
చిన్నారులు తమ ఉపాధ్యాయులు, బంధువులు, చివరకు మహిళ చేతిలో కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. రైళ్లలో, ఆధ్యాత్మికంగా రద్దీ ఉండే ప్రదేశాలల్లో, పాఠశాలల్లో, బస్సులు, ఇళ్లు, విద్యాలయాలలో కూడా వేధింపులు ఉన్నాయంది. తమకు ఎదురైన లైంగిక వేధింపులను గురించి తమ పెద్దలకు చెప్పే ధైర్యం చిన్నారులు చేయలేకపోతున్నారు. తాము చెప్పినా నమ్మరేమో అని భయం, సందేహంతోనే వారు వాటిని భరిస్తూ మౌనంగా ఉంటున్నారు. అదే పురుషులు తమ మీద జరిగిన లైంగిక వేదింపులను గూర్చి చెబితే సమాజం అంతా అతడిని అదోలా చూసి ఎగతాళి చేస్తుంది. మరోవైపు మహిళలు చెబితే వాటిని వింటూ ఎంజాయ్ చేస్తారు.
కొందరైతే తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఇంట్లో చెబితే, చదువు, స్కూల్, కాలేజీలు, ఉద్యోగాలు.. ఇలా అన్నింటిని పెద్దలు మానివేయిస్తారనే భయం కూడా యువతలో, బాల్యంలో ఉంటుందని తేల్చిచెప్పింది. అలా జరుగుతుందని తెలిస్తే కనీసం తమను బయటికి కూడా పంపరనే భయం పిల్లల్లో, ఆడవారిలో నాటుకుపోయిందని ఆమె ఈ లైంగిక వేధింపులను సరిగ్గా వివరించింది. ఈమె చెప్పిన దాంట్లో ప్రతి విషయం అక్షరసత్యమే.