తన ఒకే ఒక్క కన్నుగీటుతో లక్షలాది ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె కేవలం 26 సెకన్ల వీడియోతో దేశంలో సంచలనం సృష్టించి, సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ఇక ఒకవైపు తమిళనాడు, కేరళలలో సాగుతున్న సినిమా థియేటర్ల సమ్మె వల్ల ఈమె మొదట నటించిన 'ఒరు ఆధార్ లవ్' చిత్రం ఇంకా విడుదల కాలేదు. ప్రియా ప్రకాష్ వారియర్‌కి పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేస్తోన్న ప్రియా పాత్రను దర్శకుడు ఒమర్‌లల్లూ నిడివి పెంచే పనిలో ఉన్నాడు. ఇక ఈ చిత్రం విడుదలయ్యే దాకా వేరే చిత్రాలలో నటించకూడదని, ఈమెని 'ఒరు ఆధార్‌లవ్'ద్వారా డైరెక్ట్ చేస్తున్న ఒమర్‌లల్లూ ఈమెతో ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఆమె నటించే రెండో చిత్రం తనతోనే చేయాలని ఆయన కండీషన్స్ పెట్టాడు. కానీ ప్రియా వారియర్‌కి మాత్రం వద్దంటే అవకాశాలు వచ్చిపడుతున్నాయి. చేయను మొర్రో అంటున్నా బిగ్ నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లు, దర్శకులు, హీరోలు ఆమెని పారితోషికంతో గాలం వేస్తున్నారు.
ఇక ఒమర్‌లల్లూ ఆమెకి కోటి రూపాయలు పారితోషికం ఇస్తేనే వేరే చిత్రంలో నటించడానికి అనుమతి ఇస్తానని చెబుతున్నాడట. ఆ విధంగా చూసుకున్నా ఆమె డేట్స్ చూసుకుంటున్న ఆయనకు కోటిలో 25లక్షలు అగ్రిమెంట్ ప్రకారం పర్సెంటేజ్ రూపంలో వస్తుంది. ఇక తాజాగా ఈమె మీద బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ నిర్మాత దర్శకుడు కరణ్‌జోహార్ కన్ను పడింది. ఈయన తెలుగులో ఎన్టీఆర్‌ని మరలా ట్రాక్ ఎక్కించిన 'టెంపర్' చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నాడు. పూరికి వచ్చిన చివరి హిట్ చిత్రం ఇదే కావడం విశేషం. మొదట ఈ రీమేక్‌ని అభిషేక్‌బచ్చన్‌తో తీయాలని భావించారు. కానీ అంత హైఓల్టేజ్, యాక్షన్ చిత్రం తన వల్ల కాదని ఆయన మర్యాదగా తప్పుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'పద్మావత్' చిత్రంతో ఎక్కడికో వెళ్లిపోయిన రణవీర్‌సింగ్ ఈ చాలెంజ్‌ని స్వీకరించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కాజల్ చేసిన పాత్రకు మొదట అలియాభట్, శ్రద్దాకపూర్‌లని అనుకున్నారు.
కానీ ప్రస్తుతం దర్శకనిర్మాతల కన్ను ప్రియా వారియర్‌పై పడింది. దాంతో ఆయన ఈ ప్రతిపాదనను వారియర్, ఒమర్‌లల్లూల ముందు పెట్టాడు. ఒమర్‌లల్లూని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక 'ఒరు ఆధార్‌లవ్' జూన్‌లో విడుదలయ్యే వరకు మరో చిత్రంలో చేయనని చెప్పిన ప్రియా తనకిష్టమైన హీరో రణవీర్‌సింగ్, కరణ్‌జోహార్, రోహిత్ శెట్టిలు కావడంతో దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఖాయం అంటున్నారు. అదే జరిగితే డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న వారియర్ చదువుకి ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదు. మరోవైపు ప్రియా ప్రకాష్ వారియన్‌ని బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా నటించిన రవీనాటాండన్‌తో కొందరు పోలుస్తున్నారు. వాటిని రవీనాటాండన్ తోసిపుచ్చింది. ప్రతి జనరేషన్‌కి సొంత లక్ష్యాలు ఉంటాయని, కాబట్టి ఆమెని తనతో పోల్చడం సరికాదని తెలిపింది.
తాను నటించిన పాత చిత్రంలోని పాట 'ఆఖియోంసేగోలీమారే' పాటను గుర్తు చేసిన రవీనా ప్రతి జనరేషన్‌కి కొన్ని లక్ష్యాలుంటాయని, 'గోలీమార్' అని ప్రస్తావించింది. ప్రియా వారియర్ నటించిన 'ఒరు ఆధార్‌లవ్' చిత్రంలోని మాణిక్య మలరాయ పువ్వే' పాటను తనదైన శైలిలో చేసిందని రవీనాటాండన్ ప్రియాపై ప్రశంసలు కురిపించింది.