సినిమా నటులను దైవాలుగా కొలిచే దేశం మనది. ఇక్కడ నటులుగా పుట్టడం పూర్వజన్మ సుకృతంగా చెప్పాలి. ఎందరో గొప్పగొప్పవారి పేర్లు, మొహాలు తెలియకపోవచ్చు గానీ నటీనటులను ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరు గుర్తిస్తారు.. ఇక ఒకనాడు అమితాబ్, షారుఖ్‌లు మాట్లాడుతూ, మేము కూడా రెమ్యూనరేషన్ తీసుకునే పని చేస్తున్నాం. దేశాన్ని ఉద్దరించడానికి మేము పని చేయడం లేదు. అలా చూసుకుంటే మాకు పద్మశ్రీని, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు ఇవాల్సిన పనిలేదు. వాటికి మేము అర్హులం కూడా కాదు. పైసా ఆశించకుండా సమాజసేవ చేసే వారికే ఆ అర్హత ఉంది అని ఓపెన్‌గా చెప్పారు. ఇక నాటి హీరోయిన్ వాణిశ్రీ ఓ సారి మాట్లాడుతూ, మిగిలిన రంగాలలో కంటే సినీ రంగంలో మేము పడే కష్టం కంటే ఎక్కువ రెమ్యూనరేషన్, గౌరవం దక్కుతున్నాయి. రోజంతా కష్టపడితే రెండు మూడొందలు కూడా సంపాదించలేనివారి కంటే మేము ఎన్నో విధాలుగా సౌకర్యంగా ఉన్నామని చెప్పింది.
ఇక బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మమ్మల్ని ఇంతగా అభిమానించడం ఏమిటి? మేము కూడా డబ్బు కోసం, పేరు ప్రతిష్టల కోసమే ఆడుతున్నాం గానీ పూర్తిగా దేశం కోసం మాత్రం కాదు అని కుండబద్దలు కొట్టాడు. కానీ ఇటీవల తమన్న మాట్లాడుతూ, మాకు ఆడంబరాలు ఉంటాయే గానీ ఆనందాలు ఉండవు. మిగిలిన అమ్మాయిలు తాము కోరుకున్నట్లుగా ఉంటారు. కానీ మేము అలా ఉండటానికి వీలులేదు. బయటి వారిని చూస్తే వారిలో నేనెందుకు ఉండటం లేదు అని బాధ కలుగుతోంది. మేము సినిమాల కోసం, ప్రేక్షకుల కోసం ఎంతో త్యాగం చేస్తున్నాం. ఎన్ని బాధలున్నా బయటకి తెలియనివ్వకుండా నటిస్తున్నాం. మాకు స్వీట్స్, ఐస్‌క్రీమ్స్ వంటివి తినే యోగం కూడా లేదని చెప్పింది.
అలా అయితే ఆమెని నటిగానే ఉండమని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు కదా...! ఇప్పుడు దానికి కౌంటర్‌గా స్వీటీ అనుష్క భారీ పంచ్‌లే వేసింది. నటనపై ఆధారపడి కోట్లు సంపాదిస్తూ, క్రేజ్ తెచ్చుకుంటూ సినిమాలు శాశ్వతం కాదు.. వేరే వ్యాపారాలు చేసుకోవాలి. అలా అయితేనే వ్యక్తిగత జీవితం హాయిగా ఉంటుంది.. అని అనే వారు కొందరైతే మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. కాబట్టి ఈ డబ్బు, కీర్తి ప్రతిష్టలు ఇక్కడే సంపాదించాం. ఇక్కడ సంపాందించిన దానిని ఇక్కడే ఖర్చుపెడతాం అనేవారు మరికొందరు అంటారు. అదే మాటను అనుష్క చెబుతోంది. నటిగా నటించడం కూడా ఓ ఉద్యోగం లాంటిదే. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలలాగా ఇది కూడా ఒకటి.
కానీ ఇతరుల కంటే మాదే ఉత్తమమైన పని. ఎందుకంటే సినిమా రంగాన్ని ఇష్టపడని వారు ఉండరు. అందరికీ సినిమాలంటే ఇష్టమే. అలాంటి రంగంలో ఉండటం నా అదృష్టం. ఇక్కడ పారితోషికమే కాదు.. ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాం. హీరోయిన్లను మనవారు రాణులుగా చూస్తారు. కష్టనష్టాలనేవి అన్ని రంగాలలో ఉంటాయి. ఇక మామూలు వ్యక్తులు చెప్పేదాని కన్నా మేము చెప్పే మాటలే ఎక్కువ ప్రాముఖ్యం సంపాదించుకుంటాయి. ఇంతకంటే ఉత్తమమైన పని మరోటిలేదు అని అంటోంది..!