పవన్‌కళ్యాణ్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. అది సినిమా చేయడానికి కాదు.. తన కోసం ఎదురు చూడటం మానేసి మరో హీరోని వెతుక్కోమని, తాను పూర్తిగా రాజకీయాలలో ఉన్న కారణంగా సినిమా చేయడం వీలుకాదని ఆయన సంతోష్ శ్రీనివాస్‌కి చెప్పేశాడు. గతంలో పవన్ పలువురు దర్శకులతో చేస్తానని చెప్పి, ఎంతో కాలం వెయిట్ చేయించి, చివరకు చేత్తులెత్తేసిన ఘటనలు ఆయనపై విమర్శలకు కారణం అయ్యాయి. సంపత్‌నంది ఎంతో కాలం 'సర్దార్ గబ్బర్‌సింగ్' కోసం వెయిట్ చేయించి, ఆయన సినిమా ప్రారంభించకుండా, సంపత్‌నంది మరో హీరోని చూసుకునేలా చేయకుండా డైలమాలో పెట్టాడు. దాంతో ఎంతో అమూల్యమైన సమయం సంపత్ నందికి వృదా అయింది. ఆ తర్వాత ఎ.యం.రత్నంతో నీసన్ దర్శకునిగా 'వేదాళం' రీమేక్ అని చెప్పి ఇప్పుడు నీసన్ సమయానికి కూడా వేస్ట్ చేశాడు.
మరోపక్క ఆయన పూర్తిస్థాయి రాజకీయాలలోకి వెళ్లినా కూడా మైత్రిమూవీ మేకర్స్ సంస్థ నుంచి ఆయన అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని, ఆ అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో కూడా పవన్ ఇప్పుడు లేడని వార్తలు వచ్చాయి. ఇక కేవలం 40రోజుల్లో భారీ రెమ్యూనరేషన్‌తో తమిళంలో వచ్చిన విజయ్ చిత్రం 'తేరీ' కథను తెలుగుకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి సంతోష్ శ్రీనివాస్ కూడా కథను ఇంతకాలం తయారు చేస్తూ ఉన్నాడు. ఇక ఈ చిత్రం ఆల్‌రెడీ తెలుగులో కూడా 'పోలీసోడు'గా డబ్ అయింది. గతంలో పవన్ 'కాటమరాయుడు'లో కూడా ఇదే పని చేశాడు. ఇక పవన్ తాజాగా సంతోష్ శ్రీనివాస్‌కి ఇక తన కోసం వెయిట్ చేయవద్దని మరో హీరోని చూసుకోవాలని తేల్చి చెప్పాడట.
అలాగే మైత్రిమూవీమేకర్స్ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా ఆయన త్వరలోనే ఇచ్చివేస్తానని, ఆ సంస్థ అధినేతలకు చెప్పాడని సమాచారం. సో.. ఎన్నికలయ్యే వరకు పవన్ సినిమాలలో కనిపించడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి పవన్ అప్పుడు నిర్ణయం తీసుకునే వీలుంది అనే చెప్పాలి...!