తాను హీరోగా ఉన్నంతకాలం అటు ఫ్యామిలీ చిత్రాలు చేయాలా? మాస్ అండ్ యాక్షన్ చిత్రాలు చేయాలా? అనే సందిగ్దంలో నటుడు జగపతిబాబు ఉన్నాడు. అందుకే రెండు తరహా చిత్రాలలో నటించినా కూడా హీరోగా నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఏదో 'శుభలగ్నం, గాయం, అంత:పురం, శుభాకాంక్షలు' వంటివి బాగా ఆడాయి. కానీ ఆయన నిర్మించి నటించిన చిత్రాలు మాత్రం తీవ్ర ఆర్థిక నష్టాలను తీసుకుని వచ్చాయి. ఇలాంటి సంధికాలంలో ఆయన విలన్‌గా నటించడానికి ఒప్పుకోవడం, బోయపాటి శ్రీను బాలకృష్ణతో తీసిన 'లెజెండ్' చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రను ఇవ్వడం ఆయన కెరీర్‌ని మలుపుతిప్పింది. మరలా హీరోగా 'పటేల్‌సార్' తీస్తే అది దెబ్బతింది.
ఇక ఇప్పుడు ఈయనకు కేవలం తెలుగులోనే కాదు.. అన్ని భాషా చిత్రాలు బహుభాషా చిత్రాలుగా రూపొందుతున్న ట్రెండ్ నడుస్తుండటంతో తమిళ, మలయాళ చిత్రాలలో కూడా బిజీ అయ్యాడు. అదే సమయంలో ఆయనకు రిచ్‌గా ఉండే ఫాదర్, అంకుల్ వంటి పాత్రలు మరలా మొనాటనీని తెస్తున్నాయి. 'శ్రీమంతుడు'తో ఇలాంటి పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ జగపతిబాబు రాబోయే ఒక చిత్రంలో మాత్రం పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా హీరోకి ధీటైన పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం రవితేజ.. 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం' వంటి వరుస రెండు హిట్స్ తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా కళ్యాణ్ కృష్ణ.. రవితేజ కోవలో 'నేలటిక్కెట్' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రవితేజకి ధీటైన విలన్ పాత్రను జగపతిబాబు చేస్తున్నాడట.
'లెజెండ్' తర్వాత మరలా అంతటి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో జగపతిబాబు నటించడం ఇదే మరోసారి అని, ఆయన పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇక నటనలో తనదైన ఈజ్ కలిగిన రవితేజకి ధీటుగా జగపతి ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో అని అందరు ఎదురు చూస్తున్నారు .! ఇందులో రవితేజకి జోడీగా మాళవిక శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి జగపతిబాబు పాత్రకి జోడీ ఉంటుందా? లేదా? అనేది చూడాలి..!