సినిమా స్టార్స్ నుంచి క్రికెట్ స్టార్స్ వరకు మనదేశంలో ఉండే వారిపై సామాన్య ప్రజలు చూపించే అభిమానం వెలకట్టలేనిది. గుళ్లుగోపురాలు కట్టడం, కటౌట్లకు పాలాభిషేకాలు, పూలు, నైవేద్యాలు పెట్టడం, తమ పిల్లలకు తమ అభిమాన హీరోహీరోయిన్ల పేర్లు పెట్టడం వంటివి చూస్తూ ఉన్నాం. ఇక స్టార్ హీరోల విషయానికి వస్తే ఆయా హీరోలు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా అభిమానులు మాత్రం రెచ్చిపోయి ఒకరితో మరొకరు తగవులు పెట్టుకుని ప్రాణాలు పోయేంతగా విపరీత పోకడలు పోతున్నారు. ఇటీవలే ఓ సంజయ్‌దత్ అభిమాని తాను మరణించిన తర్వాత తన ఆస్థి, నగలు వంటి విలువైన ఆస్తులన్నీ సంజయ్ పేరిటి రాయడం సంచలనం సృష్టించింది.
ఇక హీరో హీరోయిన్లు వారిని ప్రేమిస్తూ కొందరు అభిమానులు రక్తంతో కూడా ప్రేమలేఖలు రాస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల వారికి, వారు అభిమానించే వారు అందరూ బాధపడాల్సి వస్తుంది. ఇక విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు పొందుతూ, వరుస చిత్రాలలో అలరిస్తున్న హీరోయిన్ మెహ్రీన్‌కౌర్. ఈమె తాజాగా తన అభిమాని చేసిన పనికి తీవ్రంగా మనస్తాపానికి లోనైంది. ఆమె అభిమాని ఒకరు తన మెడపై ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు.
ఈ ఫొటోని ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అభిమానులందరూ తనకి ఎంతో ఇష్టమని, ఇలాంటి పనులతో వారు తమని తాము బాధించుకుని తనని బాధపెట్టవద్దని కోరింది. ఈ మాటను చెబుతూనే తనమీద ఇంత అభిమానులు ఉన్నారని అందుకు సంతోషిస్తున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆమె 'ఐలవ్‌యూ ఆల్'అని కామెంట్ చేసింది.