రామ్ చరణ్ రెండో సినిమానే రాజమౌళి డైరెక్షన్ లో మగధీర చిత్రాన్ని చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు. అప్పట్లో మగధీరతోనే రామ్ చరణ్ 80 కోట్ల మార్క్ ని అందుకుని మొదటిసారి బాక్సాఫీసు రికార్డులను సృష్టించాడు. అసలు హీరోగా చరణ్ ఏమిటి అనుకున్నతరుణంలో మగధీరతో దున్నేసిన రామ్ చరణ్ ఆతర్వాత మళ్ళీ అంతటి హిట్ ని అందుకోలేకపోయారు. అప్పటినుండి ఎన్ని సినిమాలు చేసినా రామ్ చరణ్ మాత్రం మగధీర రేంజ్ ని అందుకోలేక కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. ఇక మగధీర తర్వాత 2016 డిసెంబర్ లో వచ్చిన ధృవ మాత్రమే కాస్త కలెక్షన్స్ పరంగా అదరగొట్టిన సినిమా.
మరి ఇప్పటికే రామ్ చరణ్ కన్నా మహేష్ 'శ్రీమంతుడు'తో, పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'తో... ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' తో అందరూ 80 కోట్ల క్లబ్బుని క్రాస్ చేసి పడేశారు. ఇక ఎన్టీఆర్ అయితే 'జై లవ కుశ' తోనూ 70 కోట్ల మార్క్ ని టచ్ చేసేశాడు. అయితే చరణ్ మాత్రం మళ్ళీ ఆ 80 కోట్ల క్లబ్బుని అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు 100 కోట్ల బిజినెస్ చేసి కలెక్షన్స్ కొల్లగొట్టబోతున్నాడా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ సినిమా మీదున్న అంచనాలు, ప్రస్తుతం ఇప్పట్లో అంటే 'రంగస్థలం' విడుదలయ్యాక రెండు వరాల పాటు పెద్ద సినిమాలేవీ లేకపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి బాగా కలిసొచ్చేలాగే కనబడుతున్నాయి.
మొదటిసారి రామ్ చరణ్ కొత్తగా మాస్, ఊర మాస్ గెటప్ లో పల్లెటూరి యువకుడిగా కనబడడం, అందాల భామ సమంత కూడా పల్లెటూరి పడుచు మాదిరి అమాయకపు పిల్లలా కనబడడం వంటి అంశాలతో రంగస్థలం పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలతోనే రామ్ చరణ్ 'రంగస్థలం' 100 కోట్లమార్క్ ని టచ్ చేసి 100 కోట్ల క్లబ్బులో కూర్చుంటుంది అంటున్నారు.