సహజంగా ఏ ఇండస్ట్రీలోని వారైనా క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తారు. సినిమా ఫీల్డ్‌కి చెందిన వారు, మరీ ముఖ్యంగా ఎప్పుడు ఇమేజ్, క్రేజ్ ఉంటాయో లేదో ఎంత కాలం ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేని హీరోయిన్లు మాత్రం మన పెద్దలు చెప్పినట్లు 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని' భావిస్తారు. ఐటం సాంగ్స్ నుంచి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, ఈవెంట్స్‌కి గంటలలోనే లక్షలకు లక్షలు వచ్చే అవకాశం వస్తే నో చెప్పరు. ఇక రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామని చెబితే అప్పటివరకు పద్దతిగా కనిపించిన వారు కూడా గ్లామర్ డోస్‌ని పెంచి గేట్లు ఎత్తివేస్తారు. కానీ అందరు అలా ఉంటారనే చెప్పలేం. అక్కడక్కడ మనకు కీర్తిసురేష్, సాయిపల్లవి వంటి వారు కూడా కనిపిస్తూ ఉంటారు.
పాతకాలంలో సినిమా వారిని దైవంగా చూసేవారు. కొలిచేవారు. వారిని స్వయంగా చూడటం అంటే ఎంతో అదృష్టంగా జనాలు ఫీలయ్యేవారు. దానికి కారణం వారు స్టూడియోలలో షూటింగ్స్ తప్ప బయటి వేడుకలు, ఫంక్షన్లు, ఓపెనింగ్స్, ఔట్‌డోర్ షూటింగ్స్ జరిపేవారు కాదు. కాబట్టే వారికంత క్రేజ్. కానీ ఇప్పుడు సినిమా అనేది నడిరోడ్డులో నిలబడి ఉంది. ఒకటి రెండు రోజుల్లో తీసే ఐటం సాంగ్స్ నుంచి ఔట్‌డోర్ షూటింగ్స్, ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి నటీనటులు ఎక్కువగా హాజరుకావడం వల్ల వారంటే క్రేజ్ తగ్గింది. క్రేజ్ ఉన్నా అది కేవలం కొద్ది గంటలు మాత్రమే.
ఇక సాయిపల్లవి విషయానికి వస్తే ఆమె తన పాత్రను తప్ప రెమ్యూనరేషన్‌ని పెద్దగా పట్టించుకోనని చెప్పడమే కాదు.. నయా సెన్సేషన్ ప్రియా వారియర్‌కి కూడా అదే సలహా ఇచ్చింది. ఇక తాను డబ్బుల కోసం గ్లామర్‌షో చేయనని, ఏ పాత్రంటే అది, ఏ సినిమా అంటే అది ఒప్పుకోనని, ఈవెంట్స్‌కి, షాపింగ్ మాల్స్ వంటి ఓపెనింగ్స్‌కి రానని చెప్పడమే కాదు.. తన మాట మీద నిలబడుతూ అదే దారిలో పయనిస్తోంది. తాజాగా ఆమెకి అమెరికాలోని ఓ పెద్ద కంపెనీ తాము ఏర్పాటు చేసే ఈవెంట్‌కి రావాలని, కొన్ని గంటల పాటు వస్తే రెమ్యూనరేషన్‌గా 13 లక్షలు, బిజినెస్ క్లాస్ టిక్కెట్స్‌తోపాటు పెద్ద స్టార్స్ హోటల్‌లో వసతులు ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చిందట. కానీ సాయిపల్లవి మరో ఆలోచన లేకుండా దానికి నో చెప్పింది. దీన్ని బట్టి ఆమె తన మాట మీద నిలబడుతోందని మెచ్చుకోక తప్పదు.