దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగులో ఎందరికో నటీనటులుగా, దర్శకులుగా, టెక్నీషియన్స్‌గా లైఫ్ ఇచ్చాడు. కానీ తన కుమారుడైన ప్రభుని నిర్మాతగా, దాసరి అరుణ్ కుమార్‌ని హీరోని చేయాలనే కలను మాత్రం నిజం చేయలేకపోయాడు. 'గ్రీకువీరుడు, చిన్నా, ఆది విష్ణు' నుంచి 'కొండవీటి సింహాసనం' వరకు ఎన్నో చిత్రాలలో నటించినా అరుణ్‌కి నటునిగా బ్రేక్ రాలేదు. ఇక ఆ తర్వాత ఆయనకు కాస్త తండ్రితో విబేధాలు వచ్చిన నేపధ్యంలో పలువురి బయటి చిత్రాలలో కూడా నటించాడు. అవి కూడా ఆయనకు హెల్ప్ కాలేదు. ఇక ఆయన కెరీర్‌లో చెప్పుకోదగింది కేవలం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'అంత:పురం' చిత్రంలోని పాట మాత్రమే. ఇక దాసరి బతికుండగానే ఈయనకు దాసరి సన్నిహితులు కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఆయనే పోయిన తర్వాత ఇక అరుణ్‌ని ఎవరు పట్టించుకుంటారు? అని అందరు భావించారు. మోహన్‌బాబు, ఆర్.నారాయణమూర్తి వంటి వారు కూడా కనీసం ఆయనను సపోర్టింగ్ రోల్స్ ద్వారా కూడా ఎంకరేజ్ చేయడం లేదు.
ఇక ఈయన 'సరైనోడు'లో ఆది పినిశెట్టి పాత్రతో పాటు మరికొన్ని చిత్రాలలో చాన్స్‌లు వచ్చానా ఆయన చేయలేదని వార్తలు వచ్చాయి. ఇటీవలే దాసరి అరుణ్ వాటిని ఖండించాడు. తనకు కేవలం నందమూరి కళ్యాణ్‌రామ్-తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీకళ్యాణం'లో మాత్రం అవకాశం వచ్చిందని, కానీ అది చేయలేకపోయానని, దాంతో ఆ పాత్రను అజయ్ చేశాడని చెప్పి, తాను నటునిగా రాణించలేకపోవడానికి తానే కారణం గానీ తన తండ్రిది కారణం కాదని చెప్పాడు. ఇక ఈయన ఇటీవల అల్లుశిరీష్ హీరోగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లుఅరవింద్ నిర్మించిన 'ఒక్క క్షణం'తో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం ఆడలేదు. ఇక తాజాగా ఈయనకు మారుతి దర్శకత్వంలో నాగచైతన్య-అను ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందుతున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో ఓ పాత్ర లభించిందట. ఈ చిత్రంలో ఆయన హీరోయిన్‌కి అంకుల్ పాత్రను పోషిస్తున్నాడని సమాచారం.
ఇక శైలజారెడ్డిగా, నాగచైతన్య అత్తగా రమ్యకృష్ణ నటిస్తోంది. మొన్నటి తరంలో దాసరి, నిన్నటితరంలో తేజ, నేడున్న వారిలో శేఖర్‌కమ్ముల, మారుతిలు నటీనటులను తమదైన శైలిలో చూపించి సక్సెస్‌ని ఇచ్చే వారిగా గుర్తింపు పొందారు. మారుతి ఇప్పటికే ఎందరో కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వడమే కాదు.. 'భలే భలే మగాడివోయ్'లో మురళీశర్మని ఆయన చూపించిన విధానం అద్భుతం. అలా చూసుకుంటే 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రమైనా దాసరి అరుణ్‌కుమార్‌కి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్రేక్‌నిస్తుందేమో చూడాలి.