పవన్‌కళ్యాణ్ తనలోని పూర్తి రాజకీయ నాయకుడిని బయటకు తీసుకువస్తున్నాడు. ఇతర పార్టీలలోని వారికి కూడా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అంతకు ముందు ఆయన వామపక్షాలు, ఇతరులతో కలిసి పనిచేస్తారా? అని ప్రశ్నిస్తే ఇతరులను కలుపుకుపోయేంత అనుభవం తనకి లేదని, తమంతట తాము వస్తే ఎవరితోనైనా నడుస్తానని చెప్పాడు. కానీ పవన్ తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రెండు సార్లు ఎమ్మెల్సీగా, ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న, 30ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్న మాదాసు గంగాధరంని తన జనసేన పార్టీలో చేర్చుకున్నాడు. పోనీ ఆయనంత ఆయన పార్టీలోకి వచ్చాడా? అంటే అదీ లేదు. తాను కొంతకాలంగా మాదాసు గంగాధరంని తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నానని, ఇప్పుడు ఆయన తన పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. చేరిందే తడవుగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభగా ఈనెల 14న గుంటూరులో జరిగే సభ నిర్వహణ బాధ్యతలను ఆయనకు పవన్ అప్పగించాడు.
ఇక మాదాసు గంగాధరం ప్రస్తుతం ఏపీ పీసీసీ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. ఈయన నెల్లూరు జిల్లా వాసి. ఈయనకంటూ స్వతంత్రంగా పది ఓట్లు కూడా పడవు. ఆయన లాబీయింగ్‌లు, పైరవీల ద్వారా తన 30ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడే గానీ ఆయనకు ప్రజల మద్దతే కాదు.. కనీసం ఆయన పేరు కూడా నెల్లూరీయులకు పెద్దగా తెలియదు. ఈయన మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి బతికున్న సమయంలో ఆయన పంచన చేరి ఆర్ధికంగా బాగా బలవంతుడయ్యాడు. ఇలాంటి జనాలలో మమేకం కాని వారిని, దొడ్డిదారిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలుగా పనిచేసిన వారికి పవన్ పెద్ద పీట వేయడం ఆయన రాజకీయ మనుగడకే ప్రమాదకరం. మాదాసు గంగాధరం చరిత్ర పవన్‌కి తెలియదని భావించలేం. ఎందుకంటే ఆయనకు మెగా ఫ్యామిలీతో 30ఏళ్ల అనుబంధం ఉంది. మెగా బ్రదర్స్ తండ్రి నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి వారి కుటుంబంతో మాదాసుకు మంచి సంబంధాలు ఉన్నాయి.
మరి పవన్ కూడా కొత్త సీసాలో పాత సారా పోసి తన అన్నయ్యలా మరోసారి తప్పు చేస్తున్నాడా? అనిపిస్తోంది. మేధావులు, ప్రజాబలం కలిగిన వారిని కాకుండా ఆయన మాదాసు వంటి వారి కోసం తాపత్రయపడటం సరికాదనే చెప్పాలి. ఇక మాదాసుకి ఉన్న కులపిచ్చి ఏమిటో ఆయన సన్నిహితులను అడిగినా బాగా చెబుతారు. మరి పవన్ నడక కూడా ఇలా సాదాసీదాగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ఆర్ధికంగా స్థితిమంతుడు కావడం తప్ప మాదాసులో ఉన్న గొప్పతనం ఏమిటో పవన్‌కే తెలియాలి.