మహేష్‌బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఎప్పుడో మొదలైనా కూడా దీనిలో నేటి పరిస్థితులకు తగ్గట్లుగా అనేక పోలిటికల్ సెటైర్లు ఉంటాయని తెలుస్తోంది. ఇక మహేష్‌బాబు డైలాగ్ మాడ్యులేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. 'దూకుడు'లో 'పోలీసూ' అని సాగదీసి పలికే మహేష్ 'భరత్ అనే నేను'లో ప్రామీసూ.. అంటూ అదే తరహాలో డైలాగును సాగదీశాడు. ఇది సినీ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఇక మోదీ ఏపీకి ప్రత్యేకహోదా హామీని ఇచ్చినట్లుగానే దానిని నెరవేర్చేలా చూసి మనిషిగా మార్చాలని, మోడీని మనిషిలా మారుద్దాం....అని కొరటాల చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. దానిపై తాజాగా మరలా కొరటాల స్పందించాడు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనమంతా ఒకటి అవుతాం.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అలాంటి వైపరీత్యాలే సంభవించాయని భావిస్తున్నాను. రాజకీయాలు, రాజకీయ నాయకుల విషయాలను పక్కన పెడితే నేను బాధ్యత కలిగిన పౌరుడిగా నా భావాలను మొహమాటం లేకుండా చెబుతాను. ఇందులో ఎలాంటి స్వార్ధం, లెక్కలు వేసుకోవడం ఉండవు అని ఆయన స్పష్టం చేశాడు. ఇంకా ఇలాగే చేస్తూ ఉంటా... కానీ రాజకీయాలు చేయను అని ఫైర్ అయ్యాడు. చూస్తుంటే కొరటాల శివ కేంద్రంపై విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టే విధంగానే ఉన్నాడని తెలుస్తోంది. కళ డబ్బు కోసం కాదు.. ప్రజలను చైతన్యవంతులని చేయడం కోసం అని నమ్మి తన మొదటి సినిమా నుంచి కొరటాల నిరూపిస్తూనే ఉన్నాడు. తనకు తోచినంతలో తాననుకున్న భావాలకు కమర్షియల్ హంగులు దిద్ది సినిమాలు తీస్తున్నాడు.
మరి కొరటాలలో ఉన్న ఆవేశం, ఆలోచన, సెంటిమెంట్, దృఢచిత్తం వంటివి సామాన్య ప్రజల్లో ఎంత వరకు ఉన్నాయనేదే ప్రశ్న. ఇక సామాన్యులు ఎలా ఉన్నా సినీ సెలబ్రిటీలు మాత్రం ముక్తకంఠంతో కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ఉంది. ఓ సమాజం పట్ల అంకిత భావం ఉన్న వారిలాగా, పోయిన ఎన్నికల్లో మోదీకి ఓటు వేయమని చెప్పినట్లే ఇప్పుడు ముక్తకంఠంతో మోదీని దించాలని సినీ సెలబ్రిటీలు పిలుపునివ్వాలి. మరి చూద్దాం.. తెలంగాణ విషయంలో తెలంగాణ వాదులు చూపిన పోరాట పటిమ ఏపీ ప్రజల్లో ఏ మేర ఉందో..?