ప్రస్తుతం స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా బాలకృష్ణ హీరోగా తన తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ ఈనెల 29న ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలోని యంగ్ ఎన్టీఆర్‌తో పాటు ఎన్టీఆర్ బాలుడు, యవ్వనం, ముసలి తనంలో ఉన్నప్పుడు ఆ పాత్రలను ఎవరు పోషిస్తారు? నందమూరి బసవతారకంగా ఎవరు నటించనున్నారనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ కూడా రూపొందనుంది. గతంలో ఇలాంటి తరహాలోనే వర్మ 'రెడ్డిగారు పోయారు' అనే చిత్రం తీయాలని భావించాడు.
ఇక ఇటీవల వినోద్‌కుమార్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగా నటించిన ఓ చిత్రం ఎప్పుడు విడుదలయిందో, ఎప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిందో కూడా తెలియదు. కాగా ఇటీవల తాప్సి ప్రధాన పాత్రలో చిన్నచిత్రంగా రూపొంది కమర్షియల్ సక్సెస్ సాధించిన 'ఆనందో బ్రహ్మ' దర్శకుడు మహి. వి.రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అంతలోనే ఈ చిత్రంలో రాజశేఖర్‌రెడ్డిగా మలయాళ స్టార్ మమ్ముట్టి, వైఎస్ భార్య విజయమ్మగా నయనతార ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. వీటిని మహి. వి.రాఘవ్ ఖండించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న మాట వాస్తవమే గానీ ఇంకా అది పూర్తి కాలేదని, తాము ఈ చిత్రం కోసం ఎవ్వరినీ అప్రోచ్ కాలేదని, మరికొంత కాలం ఆగితే గానీ ఈ చిత్రంలో ఎవరెవ్వరు నటిస్తారు? అనే విషయంలో క్లారిటీ వస్తుందని మహి అంటున్నాడు.
అయినా వైఎస్ చరిత్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. అలాంటప్పుడు మమ్ముట్టి, నయనతార వంటి వారిని భారీ పారితోషికాలు ఇచ్చి తీసుకోవాల్సిన పనిలేదు. తెలుగు ఆర్టిస్టులనే పెట్టుకుంటే సరిపోతోంది. ఇక ఈ చిత్రంలో జగన్ పాత్రను ఎవరు చేస్తారు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది....!