మెగా మేనల్లుళ్లయిన సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్‌లకు తమ తల్లి అంటే ఎంతో ప్రేమ. ఇక సాయిధరమ్‌తేజ్ అయితే తల్లిచాటుబిడ్డ. తాను ఏం చేసినా తన తల్లికి చెబుతానని, ప్రేమించినా, బ్రేకప్ అయినా, చివరకు మద్యం తాగే అలవాటు కూడా తన తల్లికి చెప్పేస్తానని ఆయన ఆమధ్య చెప్పుకొచ్చారు. తన తల్లి కూడా కాస్త తక్కువగా తాగు. తాగినప్పుడు వెహికల్‌ని డ్రైవ్ చేయకు అని చెబుతుందన్నాడు. ఇక ఈయన పలు వేదికలలో తన తల్లిని వేదికపైకి పిలిచి సత్కరించాడు. తనకి వచ్చిన అవార్డును తన తల్లి చేతులకు అందజేశాడు.
ఇక తాజాగా మహిళాదినోత్సవం సందర్భంగా సాయిధరమ్‌తేజ్, ఆయన సోదరుడు వైష్ణవ్‌తేజ్‌లు తమ తల్లికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. కానీ ఇది డబ్బుతో కొనే గిఫ్ట్ మాత్రం కాదు. కేవలం తమ ప్రేమను వ్యక్తపరిచే బహుమతి. ఈ అన్నదమ్ములిద్దరు తల్లికి చెరోవైపు నిలుచుని తమ తల్లి బుగ్గలపై ముద్దుపెడుతోన్న ఫొటోని పోస్ట్ చేశాడు. ఇక నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా తల్లే కారణం. మహిళాదినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే తేజు హ్యాట్రిక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్స్‌ని కూడా దాటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇక తన చినమామయ్య పవన్‌కళ్యాణ్‌కి 'తొలిప్రేమ' ద్వారా బ్లాక్‌బస్టర్‌ని అందించిన లవ్ మూవీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో తన పెదమామయ్య చిరంజీవికి పలు హిట్స్ ఇచ్చిన సీనియర్ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌లో కె.యస్.రామారావు నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నాడు.
ఇందులో ప్రధాన పాత్రను అనుపమ పరమేశ్వరన్ పోషిస్తోంది. దీని తర్వాత తేజు విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇలా తన కెరీర్‌లో తొలి ప్రేమకధా చిత్రంతో పాటు యేలేటితో డిఫరెంట్ జోనర్‌లో చేస్తున్న చిత్రాలపైనే ఈ మెగాహీరో ఆశలన్నీ ఉన్నాయి.