సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంతమందుంటారో చెప్పక్కర్లేదు. సౌత్ లో రజినికున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అసలు రజినీకాంత్ తో సినిమా అంటే దానికుండే అంచనాలు, క్రేజ్ మాటల్లో వర్ణనాతీతం. రజిని సినిమాలో అవకాశం వస్తే చాలు వాళ్ళకి ఇక పండగ. పారితోషకంతో పనిలేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటిస్తున్నామనే ఆనందంలో నటీనటులు ఉంటారు. అలాగే వారికీ మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం రజినీకాంత్ తో నటించే నటీనటులకు కాదు జంతువులకు అంతే డిమాండ్ ఉందట. రజినీకాంత్ తో కలిసి నటించినందుకు గాను ఒక కుక్కకి ఇప్పుడు తమిళనాట భారీ డిమాండ్ ఏర్పడిందట.
ఇంతకీ ఆ శునకం కథా కమామిషు ఏమిటా అనుకుంటున్నారా... అదేనండి రజినీకాంత్ - రంజిత్ పాల కాంబోలో 'కాలా' సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో డాన్ గా నటించనున్న రజినీకాంత్ కి పెంపుడు జంతువుగా 'మణి' అనే కుక్క నటించింది. మరి రజినీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ కుక్కకి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు దాని దశ కూడా పెరిగిపోయింది. కేవలం రజిని పక్కన నటించినందుకుగాను ఆ శునకానికి భారీ డిమాండ్ వచ్చేసింది. రజినీతో కలిసి 'కాలా' లో నటించిన ఆ కుక్క కోసం ఇప్పుడు చాలామంది పోటీ పడుతున్నారనే విషయం ఆ కుక్క ట్రైనర్ సిమన్ చెబుతున్న మాట.
సిమన్ అనే వ్యక్తి చాలా రకాల కుక్కలను పెంచుతూ సినిమాల షూటింగ్స్ కోసం వాటిని పంపుతుంటాడు. అయితే ఇప్పుడు కాలాలో నటించిన మణి గురించి సిమన్ మాట్లాడుతూ చెన్నైలోని ఓ రోడ్ పైన మణి కుక్క దొరికింది. చాలా కుక్కలను చూసిన తర్వాత కాలా దర్శకుడు రంజిత్ ఈ కుక్క మణిని ఓకే చేశాడు. ఇక సూపర్ స్టార్ రజిని గారికి కూడా ఈ కుక్క అంటే చాలా ఇష్టం. కాలా షూటింగ్ జరిగినన్నినాళ్లు రజిని గారు దానిని ఎంతో ప్రేమగా చూసుకోవడమే కాదు.... దాని కోసం ప్రత్యేకమైన బిస్కట్లు తెచ్చేవారు. ఆ సినిమాలో నటించిన తర్వాత మణిని కొనడానికి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకూ ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను మాత్రం మణిని అమ్మదలచుకోలేదు .. ఎందుకంటే నేను దీన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.