గతనెల 24న దుబాయ్‌లో అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం అందరినీ కలిచి వేసింది. ఇక ఇప్పుడిప్పుడే ఆమె కూతుర్లు, భర్త ఆ షాక్ నుంచి తేరుకుంటున్నారు. ఈ సందర్భంగా బోనీకపూర్‌కి ఎంతో సన్నిహితులైన నిర్మాతలు, దర్శకులు వచ్చి శ్రీదేవి బయోపిక్‌ని సినిమాగా తీస్తామని కోరారట. దానికి ఆయన నో అని చెప్పాడు. ఇక శ్రీదేవి బాలనటి నుంచి తెలుగు, తమిళం, బాలీవుడ్ వరకు దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఆమెది. ఆమె జీవితంలోని మలుపులు, సంఘటనలు, పరిస్థితులు, ఆమె అనుభవించిన, పడిన కష్టాసుఖాలు కేవలం రెండు గంటల్లో తెరమీద తీయడం అసాధ్యమని బోనీకపూర్ వారికి నో చెప్పాడట.
దీనిని ఓ డాక్యుమెంటరీగా అయితే సమయం పరిమితులు లేకుండా సంపూర్ణంగా శ్రీదేవి జీవితాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని బోనీకపూర్ భావిస్తున్నాడు. దాంతో ఈ డాక్యుమెంటరీ బాధ్యతలను బోనీకపూర్ తనకి ఎంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కపూర్‌కి ఇచ్చాడని అంటున్నారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' చిత్రం శ్రీదేవిని లేడీ సూపర్‌స్టార్‌ని చేసింది. ఆ షూటింగ్ సమయంలో దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఆమెని దగ్గర నుంచి గమనించాడట. ఇక శ్రీదేవిపై ఇప్పటికే కర్ణాటకకి చెందిన పలువురు ఆమె ఫ్యాన్స్ డాక్యుమెంటరీగా తీస్తామని, శ్రీదేవి బతికున్నరోజుల్లోనే ఆమె, బోనీ అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు బోనీ ఎంటర్ కావడంతో వారు డ్రాప్ కావడం ఖాయమని చెప్పవచ్చు.