తంతే గారెల బుట్టలో పడటం అనే సూక్తిని మన పెద్ద వారు చెబుతారు. ఇది నిజమేనని ప్రియా ప్రకాష్ వారియర్ నిరూపిస్తోంది. ఈమె నటించిన 'ఒరు ఆధార్ లవ్'లో ఏదో సెకండ్ హీరోయిన్‌గా చేస్తూ తమాషాగా ఇందులోని ఓ పాటలో యూత్‌కి నచ్చేలా కన్నుగీటి హావభావాలు చూపింది. ఇవి విడుదలైన తర్వాత కేవలం 26 సెకన్ల ఈ వీడియో సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. నిజానికి ఈమెకి అంత పేరు, ప్రఖ్యాతులు వస్తాయని దానిలో నటించేటప్పుడు కాదు... ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు కూడా ఆమె ఊహించి ఉండదు. ఇక ఈ ఒక్క కన్నుగీటులో ఈమె సోషల్ మీడియాలో సంచలనంగా మారి, విపరీతమైన ఫాలోయర్స్‌ని సాధించుకుంది.
అతి తక్కువ సమయంలోనే ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ సంఖ్య ఆరు మిలియన్లుకి చేరింది. ఇక ఈమె చేసే ఒక్కో పోస్ట్ ఏడెనిమిది లక్షల ఆదాయాలను తెస్తోంది. దీంతో ఈమెకి మలయాళంలోనే కాదు.. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తన చిత్రం విడుదల తర్వాతే ఆమె ఎందులో నటించాలి అనే నిర్ణయం తీసుకోనుంది. ఈమె డేట్స్ కూడా చూస్తున్న 'ఒరు ఆధార్ లవ్' దర్శకుడు ఉమర్‌లల్లూ ఈమె నటించే రెండో చిత్రం కూడా తనదేనని ఆమె చేత అగ్రిమెంట్ చేయించుకోవడమే గాక ఈమెని ఎవరైనా సినిమాల కోసం అప్రోచ్ అయితే ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ని డిమాండ్ చేస్తున్నాడట.
ఇక తాజాగా ఈమెకి పలువురు కమర్షియల్ ఉత్పత్తిదారుల నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను ఆమె తన సోషల్ మీడియాలో కనుక పోస్ట్ చేస్తే పోస్ట్‌కి 8 నుంచి 10లక్షలు ఇస్తామని కూడా ముందుకు వస్తున్నారు. త్వరలో ఆమె వీటికి గ్రీన్‌సిగ్నల్ చెప్పే అవకాశం ఉంది. అందుకే తంతే గారెల బుట్టలో పడటం అంటే అది ప్రియా వారియర్ విషయంలోనే నిజం అవుతోంది.