ఈమధ్యన ఒక సినిమా టీజర్ గాని, ట్రైలర్ గాని విడుదలకాగానే... అది ఆ సినిమా కాపీ, ఇది హాలీవుడ్ సినిమా కాపీ, కాదు కాదు ఫ్రెంచ్ సినిమా కాపీ అంటూ రకరకాల న్యూస్ లు రావడం... ఆ న్యూస్ లతో దర్శకనిర్మాతలకు కంగారు మొదలవుతుంది. సినిమా మొదలుపెట్టాక ముందే ఏదో ఒక సినిమా రీమేకో... లేదంటే... ఒక నవల తీసుకుని దాన్ని సినిమా చేస్తున్నామని చెప్పేస్తే... సినిమా మీద క్రేజ్ పోతుందని భయపడి దర్శకనిర్మాతలు దాచేస్తుంటే... ఇలా ట్రైలర్స్, టీజర్స్ బయటికి రాగానే అనేక అపవాదులు మూటగట్టుకోవాల్సి వస్తుంది. మొన్నటికి మొన్న అజ్ఞాతవాసి విషయంలో అదే జరిగింది.
అలాగే గతంలో కొరటాల శివ - మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ విషయంలో కూడా ఒక రైటర్.. కొరటాల మీద మహేష్ మీద కూడా కేసు వేశాడు. అయితే స్వతహాగా రైటర్ అయిన కొరటాల తాను కథలు అందించిన సినిమాల విషయంలో ఎక్కడా తేడా రాలేదుగాని.. తాను డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు విషయంలో సినిమా విడుదలై బంపర్ హిట్ కొట్టాకా చాలా గొడవలే జరిగి విషయం కోర్టు మెట్లెక్కింది. మరి ఒక కథా రచయితగా తన కథను ఎంతో బలంగా సినిమాని డైరెక్ట్ చెయ్యగలిగిన కొరటాలకు అలాంటి విషయం తలనొప్పి తెచ్చిపెట్టింది. అతను తీసిన మూడు సినిమాల కథలను కొరటాల సమకూర్చుకుని హిట్ కొట్టాడు.
కానీ ఇప్పుడు కొరటాల డైరెక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న 'భరత్ అనే నేను' సినిమా కథ మాత్రం వేరే దగ్గర తీసుకున్నాడని టాక్ నడిచింది. ఒక స్టోరీ రైటర్ నుండి కొరటాల ఈ భరత్ అనే నేను కథని భారీ ధర వెచ్చించి కొన్నాడని అన్నారు. కానీ భరత్ టీజర్ చూశాక ఇది పూర్తిగా కొరటాల వెర్షన్ అన్నట్టుగా కనబడుతుంది. కొరటాల సినిమాల్లో బలమైన పాత్రలు వాటి చుట్టూ ఒక సామాజిక బాధ్యత.. ఇలా భరత్ అనే నేను చూస్తుంటే అర్ధమవుతుంది. అలాగే భరత్ అనే నేను టైటిల్ లో ఎక్కడా కొత్త స్టోరీ రైటర్ పేరు కనబడకపోయేసరికి అందరూ ఈ భరత్ అనే నేను కథ కొరటాలదే అన్నట్టుగా ఫిక్స్ అవుతున్నారు. మరి భరత్ టీజర్ లో స్టోరీ రైటర్ క్లారిటీ లేకపోయినా ట్రైలర్ లోగాని సినిమా విడుదలయ్యాక టైటిల్స్ లోగాని క్లారిటీ వస్తుందేమో చూడాలి.