గత రెండు రోజులుగా తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులోను బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ అండ్ రెగ్యులర్ షూటింగ్ గురించి ప్రకటించేసరికి ఆ న్యూస్ కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ కి టైటిల్ ని 'ఎన్టీఆర్' అని... ఇక 'ఎన్టీఆర్' సినిమా కూడా ఈనెల 29 నే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోబోతోందని బాలకృష్ణ అమరావతి సాక్షిగా మీడియాకి తెలియజేశాడు. ఇక బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ విషయాన్ని అలా చెప్పాడో లేదో... ఇలా ఆ సినిమాపై మళ్ళీ బోలెడన్ని న్యూస్ బయలుదేరాయి.
అందులో ప్రధానంగా హైలెట్ అయిన న్యూస్ ఏంటయ్యా అంటే.. యంగ్ ఎన్టీఆర్ పాత్రను యంగ్ హీరో శర్వానంద్ చేయనున్నట్టుగా గత రెండు రోజులుగా వార్తలు వ్యాపించాయి. అందులోను నిన్న మంగళవారం శర్వానంద్ పుట్టిన రోజు కావడం ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా శర్వా నటించడం అనే న్యూస్ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. కానీ ఈ విషయమై అటు శర్వానంద్ గాని, ఇటు బాలయ్య బాబు గాని స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఈ లోపు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు తేజ చెవిన శర్వానంద్ న్యూస్ పడగా... ఆ న్యూస్ విషయమై తేజ తనదైన శైలిలో స్పందించాడు.
అదేమిటంటే ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ నటిస్తున్నాడని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. అదంతా ఒట్టి పుకారు అని స్పష్టత నిచ్చేశాడు. అలాగే యంగ్ ఎన్టీఆర్ పాత్ర కోసం ఇంతవరకు ఎవరిని సంప్రదించలేదని....అసలు ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేసిన వెంటనే అధికారిక ప్రకటన చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి.... కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.