ఈనెల 2 వ తేదీ నుంచి థియేటర్ల బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంత కాలం కిందట విడుదలైన చిత్రాలు దీని వల్ల కాస్త దెబ్బతిన్నాయి. మరోవైపు కొత్తగా రిలీజ్ అయ్యే చిత్రాలకు ప్రత్యామ్నాయ తేదీలను చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ వివాదం తెగే దాకా లాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎగ్జిబిటర్లు, నిర్మాతలకి సంబంధించిన విషయం ఇది. దీనితో సామాన్య ప్రేక్షకునికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం సర్వీస్ ప్రొవైడర్లు, నిర్మాతలకు మధ్య వచ్చిన ఈ వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. తాజాగా ఫిల్మ్‌చాంబర్‌లో జరిగిన సమావేశాలకు కొందరు తమిళ నిర్మాతలు కూడా హాజరు కావడం విశేషం. ఇలా దక్షిణాది మొత్తం దీనిపై ఓ కలసికట్టు నిర్ణయానికి వస్తే క్యూబ్ రేట్లు, యూఎఫ్‌ఓల విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
క్యూబ్‌రేట్లు, యూఎఫ్‌ఓల వంటి వాటిని పూర్తిగా ఎత్తివేయాలని నిర్మాతల డిమాండ్, కానీ చివరకు సర్వీస్ ప్రొవైడర్లే కాస్త మెత్తపడ్డారని తెలుస్తోంది. ఆపరేటర్లు మొదట 9శాతం తగ్గిస్తామని చెప్పి, ఆ తర్వాత ఇంకా తగ్గించి నిర్మాతలతో ఓ అవగాహనకు వచ్చారట. దాంతో మార్చి8 వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి థియేటర్లు మరలా ఓపెన్ కానున్నాయని తెలుస్తోంది . సో...ఇక సినిమా ప్రియులు కొత్త చిత్రాల కోసం వారం రోజులుగా ఎదురు చూపులు ఫలించనున్నాయమని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.