స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈమధ్య ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగా మరో దానిపై దృష్టి పెట్టడం లేదు. స్లో అండ్ స్టడీ విన్స్‌ది రేస్ అన్నట్లుగా ఓ చిత్రం అనుకుంటే ముందుగా కథలను ముందేసుకుని తనకు సూట్ అయ్యే కథను ఓకే చేయడం, తర్వాత దర్శకులతో చర్చలు, స్క్రిప్ట్‌వర్క్ వరకు అన్నింటిలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇలా చేస్తుండటంతోనే ఆయన ఓ సారి ఓ చిత్రమే చేయడం, ఆ చిత్రం పూర్తయ్యే వరకు దానిలోనే లీనం కావడం, పరకాయ ప్రవేశం నుంచి, మేకోవర్ వరకు అన్ని విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దాని వల్లనే ఆయన నటించిన యావరేజ్ కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా భారీ కలెక్షన్లు సాధించి పెడుతున్నాయి.
కాగా ప్రస్తుతం ఆయన సుకుమార్ తర్వాత మరోసారి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రచయిత వక్కంతం వంశీకి దర్శకత్వ భాధ్యతలు అప్పగించి 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి రోజులకు వచ్చింది. మే 4వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. దీని తర్వాత బన్నీ ఎవరి దర్శకత్వంలో చేస్తాడనే విషయంలో లింగుస్వామి నుంచి కొత్త దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. 'మనం' విక్రమ్ కె.కుమార్, కొరటాల శివ పేర్లు కూడా వినిపించాయి. కానీ బన్నీ తన తదుపరి చిత్రం విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చేయడానికి ఓకే చేశాడట. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్నిన 'వేదం' చిత్రంలో బన్నీ కీలకమైన పాత్రను పోషించాడు.
ఇక క్రిష్ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో తనని తాను నిరూపించుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌లో కంగనారౌనత్‌తో 'మణికర్ణిక' చిత్రం చేస్తున్నాడు. ఇటు బన్నీ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' విడుదల హడావుడి, మరో వైపు 'మణికర్ణిక' ల తర్వాత క్రిష్-బన్నీల కాంబినేష్‌లోని చిత్రం రూపొందనుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు నచ్చే ఓ సైన్స్‌ఫిక్షన్ అని అంటున్నారు.