అతిలోక సుందరి శ్రీదేవి మరణ వార్త నుంచి ఇంకా సామాన్యులే బయటికి రాలేకపోతున్నారు. ఇక కపూర్ ఫ్యామిలీ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ తల్లి తప్ప వేరే లోకం తెలియని శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషీలు ఈ మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక బోనీకపూర్ మొదటి భార్య మోనాకపూర్ బతికున్నంత కాలం ఆమె శ్రీదేవి పేరు వింటేనే మండిపడేది. తన భర్తని తనకి కాకుండా చేసిందనే కోపం ఆమెది. ఇక బోనీ తల్లి ఓ సారి తన కుమారుడిని శ్రీదేవి వలలో వేసుకుందనే కోపంతో పబ్లిక్ గా చెంపదెబ్బలు కొట్టింది. ఇక బోనీకపూర్-మోనాకపూర్‌ల పిల్లలైన అర్జున్ కపూర్, అన్షులాలతో పాటు శ్రీదేవి-బోనీల పిల్లలైన జాన్వి, ఖుషీలు అంటే మొత్తం నలుగురు పిల్లల బాధ్యత ఇప్పుడు ఒక్కసారిగా బోనీపై పడింది.
కానీ శ్రీదేవి మరణానంతరం తన పిల్లలు తనకు ఎంత అండగా నిలిచారో ఆయన ఆల్‌రెడీ చెప్పేశాడు. మరోవైపు అర్జున్‌కపూర్ గానీ, అన్షులా గానీ నాటి నుంచి శ్రీదేవి, ఆమె పిల్లలకు దూరంగానే ఉంటూ వచ్చారు. అర్జున్‌కపూర్ అయితే తన నోటితో శ్రీదేవిని అమ్మ అని కూడా పిలవడానికి ఒప్పుకునేవాడు కాదు. కానీ శ్రీదేవి మరణం తర్వాత ఆయన తన తండ్రికి, సవతి చెల్లెళ్లకు అండగా నిలబడ్డాడు. తల్లి మరణం తర్వాత జాన్వి, ఖుషీలు ఈ దు:ఖం నుంచి తొందరగా కోలుకోవాలని అన్షులా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. కానీ ఓ అభిమాని అర్జున్‌కపూర్, అన్షులాలను వెనకేసుకుని వస్తూ జాన్వి, ఖుషీలను తీవ్ర పదజాలంతో తప్పుపట్టాడు. వారిపై అలా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అన్షుల్లా ఆ నెటిజన్‌కి వార్నింగ్ ఇచ్చింది.
తన చెల్లెళ్లయిన జాన్వి, ఖుషీల గురించి అలా మాట్లాడితే సహించేదే లేదని తేల్చిచెప్పింది. ఆ తర్వాత కాస్త స్థిమితంలో ఓ పోస్ట్ చేసింది. హాయ్.. నా చెల్లెళ్లపై అసభ్యపదజాలం ప్రయోగించవద్దని కోరుకుంటున్నాను, నేను మాత్రం మిమ్మల్ని సమర్ధించడం లేదు. మీ కామెంట్స్‌ని నేను తొలగించి వేస్తున్నాను. అదే సమయంలో నాపై అర్జున్‌కపూర్‌పై చూపించిన ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను. థ్యాంక్యూ ఫర్ ది లవ్ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి బోనీ నలుగురు పిల్లలు ఇప్పుడు ఒకటి కావడం మాత్రం ఆనందదాయకం.