పాతకాలంలో విఠలాచార్య నుంచి ఎందరో ట్రిక్ ఫొటోగ్రఫీ నేపధ్యంలో పలు చిత్రాలను తీసి ఉండవచ్చు. కానీ నిన్నటి తరంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఘనత మాత్రం కోడిరామకృష్ణకే దక్కుతుంది. నాడు ఎవ్వరూ సరికొత్త గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లపై పట్టులేక మామూలు చిత్రాలు తీసే సమయంలోనే అప్పుడప్పుడే వస్తున్న సాంకేతిక విప్లవాన్ని తనకు అనువుగా మలచుకుని 'అమ్మోరు, అరుంధతి, అంజి, దేవి, దేవీపుత్రుడు' వంటి చిత్రాలు తీసిన గ్రేట్ డైరెక్టర్ కోడిరామకృష్ణ. ఇక ఇలాంటి భారీ చిత్రాలే కాదు.. కధాబలం ఉన్న 'ఇంట్లోరామయ్య-వీధిలో కృష్ణయ్య, మాపల్లెలో గోపాలుడు, మంగమ్మగారిమనవడు, ముద్దల మామయ్య, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, పుట్టింటికి రా చెల్లి, మావూరి మారాజు' ఇలా ఎన్నో చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకి అందించి, శతాధిక చిత్రాల దర్శకునిగా నిలిచారు.
ఇక ఈయన తాజాగా రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రం గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. 'బాహుబలి' చిత్రం చూస్తుంటే నాకు ఎంతో భయం వేసింది. టెన్షన్ పడ్డాను. 'బాహుబలి'ని తీయడం అంత సులువైన విషయం కాదు. వేలమంది జూనియర్ ఆర్టిస్టులను ఎలా తీసుకువచ్చారు? ఎలా భోజనాలు పెట్టారు? అనేది నాకు అంతుచిక్కక సినిమా చూస్తుంటేనే టెన్షన్ వచ్చింది. ఇంత మంది, ఇన్నిరోజులు షూటింగ్ అంటే నిర్మాతలకు ఓ రేంజ్‌లో టెన్షన్ ఉంటుంది. అలాంటి టెన్షన్‌ని తట్టుకుని నిలబడిన నిర్మాతలకు నేను మొదట ఎక్కువ మార్కులు ఇస్తాను. ఇంత టెన్షన్‌లోనూ తన టైమింగ్ మిస్ కాకుండా, వెనుకంజ వేయకుండా పనిచేసిన రాజమౌళి ఎంతో గొప్పవాడు. నిర్మాతలు అంగీకరించడం ఓ విశేషమైతే తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడం రాజమౌళి గొప్పతనం. ఇద్దరినీ అభినందించాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఇలా తెలుగులో గ్రాఫిక్స్‌కి ఆధ్యునిగా చెప్పుకునే కోడి రామకృష్ణ పొగడ్తలు రాజమౌళి గొప్పతనాన్ని తెలుపుతాయి. ఇక కోడి రామకృష్ణ కూడా ఏవో గ్రాఫిక్స్ కోసం గ్రాఫిక్స్ అన్నట్లుగా కాకుండా కథలో ఒక భాగంగా, అంతర్లీనంగా విజువల్ ఎఫెక్ట్స్ జోడించేవాడు. ఈ విషయంలో జక్కన్న కూడా అదే దారిలో నడిచి సెహభాష్ అనిపించుకున్నాడు.