సినిమా వారికి కమర్షియల్ పాయింట్సే కావాలి. అదే జవాన్ పాత్ర అయితే అందులో అన్ని కమర్షియల్ అంశాలను మేళవించే కమర్షియల్ యాంగిల్ బాగా ఉంటుంది. కానీ జవాన్ సంగతి సరే.. కిసాన్ సంగతి గురించి ప్రభుత్వాలే కాదు.. మీడియా, సినిమా వారు కూడా చిన్నచూపు చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలోని వారందరికీ చివరకు ప్రభుత్వాలకు కూడా రైతంటే శీతకన్ను. వారు పండించే తిండి తింటాం గానీ వారికి మాత్రం పురుగుల మందే పరమాన్నం అవుతోంది. 2009 నుంచి మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే తాజాగా ఓ టిడిపి మంత్రి వరి పంట సోమరి పోతుల పంట అని చెప్పాడు.
ఇక రైతులకు తిన్నది అరగకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నాటి బిజెపి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇదంతా రైతులు కలిసికట్టుగా ఓటు బ్యాంకుగా మారకపోవడం వల్లనే జరుగుతోంది. సాధారణంగా ఏ వస్తువును తయారు చేసిన వారైనా ఆ వస్తువు రేటును వారే నిర్ణయిస్తారు. కానీ రైతులకు మాత్రం ఆ స్వేచ్చ లేదు. గిట్టుబాటు ధర లేదు. అన్ని నియమ నిబంధనలే. స్వామినాథన్ కమిటీ చేసిన సిపార్సులను పట్టించుకున్నవారు లేరు. ఇప్పుడు ఇదే విషయాన్ని సినిమాలను కమర్షియల్ కోణంలో కాకుండా సామాజిక బాధ్యతగా భావించే ఆర్.నారాయణమూర్తి 'అన్నదాత సుఖీభవ'గా తెరకెక్కిస్తున్నాడు. 'రైతే రాజు అనే నానుడి ఇప్పుడు లేదు. జై జవాన్..జైకిసాన్ నినాదమే ముగిసిపోయింది. రైతు బతకాలి. ప్రపంచాన్ని బతికించాలని' ఈ చిత్రం ద్వారా చెబుతున్నట్లు పీపుల్స్ స్టార్ తెలిపారు.
ఇక ఈ చిత్రంలో వంగపండు రాసిన పాటని బాలు అద్భుతంగా పాడారు. ఆయనకు హ్యాట్సాఫ్. ఇంకా గద్దర్, సుద్దాల, గోరేటి వెంకన్న వంటి వారందరూ సపోర్ట్ చేశారు. ఈ చిత్రాన్ని మా గురువు గారు దాసరికి అంకితమిస్తున్నాను. ఇక దక్షిణాది పరిశ్రమ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం గొప్పదని ఆయన అంటున్నారు.