ఎవరినైనా కదిలిస్తే చాలు అయితే యాక్టర్ లేదా దర్శకుడు అనేస్తున్నారు. రచయితలు మెగాఫోన్ చేతబడుతున్నారు. రచయితలే నటులుగా బిజీ అవుతున్నారు. ఇక విషయానికి వస్తే కొంతకాలం కిందటి కమెడియన్‌గా సునీల్‌కి ఎక్కడలేని క్రేజ్ ఉండేది. యంగ్ హీరోలకు ఫ్రెండ్‌గా బ్రహ్మానందం సరిపోడు కాబట్టి అందరు సునీల్ కోసమే ఎగబడేవారు. దాంతో ఆయన ఆర్ధికంగా కూడా మంచి స్థితిలో ఉన్నాడు. కానీ ఆ తర్వాత హీరో పిచ్చి పట్టింది. అది కూడా కామెడీ హీరోగా కాకుండా మాస్ హీరో కావాలనే దురద ఎక్కువైంది. దాంతో పాటు ఆయన నటించిన రెండు మూడు చిత్రాలు ఓకే అనేసరికి ఇక తనకు తానే తిరుగేలేని హీరోగా భావించాడు. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ, ప్రతిష్టాత్మక 150 వ చిత్రంలో చిన్న వేషం అయినా వేయాలని అందరు భావిస్తే అందులో నటించమని చిరు కోరినా సునీల్ నో చెప్పాడు.
ఇక పవన్ 'అజ్ఞాతవాసి' విషయంలో అదే జరిగింది. కానీ ఇప్పుడు సునీల్ వరుస పరాజయాలతో భ్రమల్లోంచి నిజంలోకి వచ్చి కమెడియన్ పాత్రలకు కూడా ఒకే చెబుతున్నాడు. చిరంజీవి 151వ చిత్రం 'సై..రా', రవితేజ-శ్రీనువైట్ల చిత్రం, తేజ-వెంకటేష్, త్రివిక్రమ్ -ఎన్టీఆర్ చిత్రాలలో కూడా ఈయన కామెడీ వేషాలు వేస్తున్నాడు. ఇక సునీల్ అందరు దర్శకుల చిత్రాలలో బాగా చేసినా త్రివిక్రమ్ చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. కానీ 'నువ్వే కావాలి' వంటి చిత్రాలలో నటించినా కూడా సునీల్‌కి సుడి తిరిగింది మాత్రం తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను'. కానీ తేజ నిర్మాతగా, దశరథ్ చిత్రం 'సంబరం'లో హీరో ఫ్రెండ్ పాత్రని తేజ సునీల్‌కి ఇచ్చినా ఆయన వాటిని ఎగ్గొట్టి 'మన్మథుడు'కి ఆ డేట్స్ ఇచ్చాడు. ఈ విషయం నాడు పెద్ద సంచలనం.
అయినా కూడా తేజ ఇప్పుడు వెంకటేష్ చిత్రంలో సునీల్‌కి కీరోల్ ఇచ్చాడని సమాచారం. ఇక ఈయన భీమనేని శ్రీనివాసరావు దర్శకకత్వంలో 'సుడిగాడు' కి సీక్వెల్‌గా రూపొందే 'తమిళపదం 2'లో కూడా ఓ పాత్ర చేయనున్నాడు. మరి సునీల్‌కి తేజ, త్రివిక్రమ్‌లూ పూర్వవైభవం ఇవ్వగలరా? అనేది వేచిచూడాల్సివుంది....!