ఈమధ్య తమిళంలో పలువురు రాజకీయ నాయకుల సపోర్ట్, గూండాలు, మాఫియా వారు బాలీవుడ్ తరహాలో కోలీవుడ్‌లో కూడా ఫైనాన్షియర్ల అవతారం ఎత్తుతున్నారు. డబ్బుకి డబ్బు పేరుకు పేరు, ప్రముఖులతో పరిచయాలు, మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలతో కలిసి ఉండే అవకాశం ఉండటంతో అందరు ఫైనాన్షియర్ల అవతారం ఎత్తుతున్నారు. ఇక ఇటీవల ఓ తమిళ ఫైనాన్షియర్ వేధింపులు భరించలేక ఓ తమిళ నిర్మాత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. దీంతో నడిగర్ సంఘంతో పాటు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడైన విశాల్ ధైర్యంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఎవరినైనా ఈ ఫైనాన్షియర్ వేధింపులకు గురి చేస్తుంటే తమిళ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయాలని, ఇలాంటి వారి వల్ల సినిమా ఫైనాన్షియర్స్ అందరికీ చెడ్డపేరు వస్తోందని, ఎవరు సాక్ష్యంగా ముందుకు వచ్చినా చట్టప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటామని విశాల్ ప్రకటించాడు.
ఈ విషయం సద్దుమణుగుతున్న తరుణంలో తాజాగా సౌత్ ఇండియన్ సినిమాలకు ఫైనాన్స్ చేసే ప్రముఖ ఫైనాన్షియర్ బోద్రా కుమార్తె కరిష్మా బోద్రా చెన్నైలో కిడ్నాప్‌కి గురైన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. బోద్రాకి ఫైనాన్షియల్‌గా దక్షిణాదిలో మంచి పేరుంది. ఆయన రజనీకాంత్, దీపికాపడుకొనేలతో రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేషన్‌ని తలపించిన 'కొచ్చాడయాన్' చిత్రానికి కూడా ఫైనాన్స్ చేశాడు. ఆ సొమ్మును ఫైనాన్స్ తీసుకున్న రజనీకాంత్ శ్రీమతి లతా రజనీకాంత్ తిరిగి చెల్లించక పోవడంతో ఆయన చెన్నై హైకోర్టులో రజనీ భార్య లతపై పిటిషిన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తన వద్ద తీసుకున్న డబ్బును లత తిరిగి చెల్లించలేదని ఆయన ఫిర్యాదు చేశాడు.
ఇలాంటి పరిస్థితుల్లో కరిష్మాబోద్రా అదృశ్యమైంది. దీంతో బోద్రా తన కుమార్తె కిడ్నాప్‌కి గురైందని టి.నగర్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్‌కి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సినీ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. దీని వెనుక కూడా ఫైనాన్స్ మాఫియా హస్తం ఉండవచ్చని అంటున్నారు. అదే సమయంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇలాంటి వార్తలు ఆయన పేరుకు డ్యామేజ్ చేస్తాయని పలువురు భావిస్తున్నారు. మరి ఈ విషయం నిజమా? నిజమైతే ఎవరి హస్తం ఉందనేది పోలీసులు తేల్చాల్సివుంది....!