తాజాగా హఠాన్మరణం చెందిన అతిలోక సుందరి శ్రీదేవి జ్ఞాపకార్ధం ఆమెకు శ్రద్దాంజలి ఘటించేందుకు ఈ రోజు (మార్చి 4) సాయంత్రం సినీ ప్రముఖులు హాజరై ఆమెకి నివాళి అర్పించనున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో అంటే తన సొంత హోటల్‌లో రాజకీయ నాయకుడు. కళాబంధు, కళాకారులకు ఎంతో కావాల్సిన టి.సుబ్బరామి రెడ్డి ఆధ్వర్యంలో ఈ సంతాప సభను నిర్వహించనున్నారు. ఈ సంతాప సభకి కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, జయసుధ, మోహన్‌బాబు, నివేధా ధామస్‌తో పాటు పలువురు హజరు కానున్నారు.
ఇక శ్రీదేవిని విపరీతంగా అభిమానించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రాంగోపాల్‌వర్మలు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఇక శ్రీదేవి తమిళ అమ్మాయి అయినా భాషా బేధం లేకుండా తెలుగువారి మనసుల్లో కొలువుతీరింది. ఈమెని అందరు తమిళ అమ్మాయిగా భావించకుండా తెలుగింటి అమ్మాయిగానే ఆదరించారు. ఇక ఈమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బాలీవుడ్ చిత్రాలలో నటించినా కూడా ఈమె అత్యధిక చిత్రాలను తెలుగులోనే చేయడం విశేషం.
ఇక తాజాగా వర్మ శిష్యుడైన పాటల రచయిత సిరాశ్రీ.. వర్మ త్వరలో శ్రీదేవిపై బయోపిక్ తీయనున్నాడని తెలిపాడు. దాంతో ఈ వార్త నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది. శ్రీదేవి బయోపిక్‌ని వర్మ తీస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై వర్మ సూటిగా స్పందించాడు. ఏంటి శ్రీదేవి బయోపిక్‌ని నేను తీయడమా? అసలు నిజం కాదు. శ్రీదేవి పాత్రను వెండితెరపై పోషించే నటి అసలు ఎక్కడైనా ఉందా? అంటూ ప్రశ్నించాడు. నిజమే.. నటన, హావభావాల, చిలిపితనం, కళ్లతోనే అభినయం, డ్యాన్స్‌లు ఇలా ఎలా చూసుకున్నా శ్రీదేవి పాత్రను చేయాలంటే మరోసారి శ్రీదేవి పుట్టాలే గానీ ఏ నటి కూడా ఆమెలా ఆమె పాత్రను వెండితెరపై పండించలేరనేది వాస్తవం...!