ప్రస్తుతం ఎన్టీఆర్, లక్ష్మీ వీరగ్రంధం, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేర్లలో మూడు ఎన్టీఆర్ రిలేడెట్ బయోపిక్‌లు రూపొందనున్నాయి. చివరకి ఏవి పట్టాలెక్కుతాయో.. ఏవి డ్రాప్ అవుతాయో చెప్పడం కష్టం. ఇక ఇదే సమయంలో సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' రూపొందుతోంది. మరోవైపు వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రగా మరో బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వినోద్‌కుమార్ హీరోగా వైఎస్‌పై చిత్రం వచ్చినా అది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు పోయిందో? ఎవ్వరికీ తెలియదు. ఇక ఇటీవల 'ఆనందోబ్రహ్మ' చిత్రానికి దర్శకత్వం వహించిన మహి. వి.రాఘవ్ వైఎస్ బయోపిక్‌కి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్ కూడా ఫైనల్ దశకు వచ్చిందని తెలుస్తోంది.
ఇక ఇందులో నాగార్జున వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రను పోషించనున్నాడని వార్తలు వచ్చాయి. నాగార్జున ఓకే చెప్పినా కూడా వచ్చే ఎన్నికల తర్వాత మాత్రమే సినిమా తీయాలని, లేకపోతే తనపై వైసీపీ ముద్ర అనవసరంగా పడుతుందని చెప్పి నో చెప్పాడట. కానీ ఎన్నికల వరకు ఆగకుండా, ఎన్నికల సమయంలో వస్తేనే ఈ చిత్రానికి మంచి ప్రమోషన్ వస్తుందని భావించిన దర్శక నిర్మాతలు మలయాళ స్టార్ మమ్ముట్టిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటించడానికి ఒప్పించారని అంటున్నారు. నిజంగా వైఎస్‌కి మమ్ముట్టి కరెక్ట్‌గానే యాప్ట్ అవుతాడు.
కానీ ఆయన్ను పెట్టుకున్నా కూడా ఇతర భాషల వారికి రాజశేఖర్‌రెడ్డి చరిత్రపై ఆసక్తి ఏమీ లేదు. మరి అంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ చిత్రాన్ని తీసినా ఇది కేవలం తెలుగుకే పరిమితమవుతుంది. మరి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రపై భవిష్యత్తులో ఎలాంటి వార్తలు వస్తాయో వేచిచూడాల్సివుంది...!