ఏమాటకామాటే చెప్పుకోవాలంటే దేశంలోని రాజకీయ నేతల్లో చంద్రబాబుది ప్రత్యేక స్థానం. ఆయన రాజకీయ నాయకుడు కాదు.. రాజనీతిజ్ఞుడు. దేశంలోని అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మోదీ ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు సీఎం. ఇక నాటి గోద్రా అల్లర్ల సమయంలో మోదీని ఏపీలోకి అడుగుపెట్టనివ్వబోనని చెప్పాడు. అది మోదీ మనసులో ఇంకా ఉంది. ఇక చంద్రబాబు తదుపరి ఎన్నికల్లో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో ఊహించగలిగిన నేర్పరి, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలను కలిసికట్టుగా చేసి తృతీయ ఫ్రంట్‌ని బలోపేతం చేసే సత్తా కూడా చంద్రబాబులో ఉంది. మరోవైపు తమిళనాడులో కమల్, రజనీ ఇద్దరికీ చంద్రబాబే ఆదర్శం. ఇక పవన్‌ని కూడా తన బుట్టలో వేసుకోగల సమర్ధుడు. దాంతో బిజెపితో ఆయన విడిపోతే టిడిపికి ఆంధ్రాలో వచ్చే నష్టం ఏమీ ఉండదు గానీ టిడిపి సాయంతో రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని చూస్తున్న బిజెపికే ఇది దెబ్బ. ఇక ఈయన వేసే అడుగులను మోదీ, అమిత్‌షాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. వాజ్‌పేయ్ హయాంలో, దేవగౌడ వంటి వారు ప్రధానులుగా ఉన్న సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఆంధ్రా భవన్‌లో ఉంటే తల పండిన నేతలే ఆయనతో సమావేశం కోసం అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసే పరిస్థితి. ఇక వాజ్‌పేయ్, అద్వానీ వంటి వారికి కూడా చంద్రబాబు సన్నిహితుడు.
ఒకవైపు బిజెపికి చెందిన వాజ్‌పేయ్, అద్వానీలతో దోస్తీగా ఉంటూనే మరోవైపు జ్యోతిబసు, సోమనాథ్ చటర్జీ, సుర్జీత్‌సింగ్ వంటి వారితో కూడా కలిసి మెలసి ఉండటం బాబు చాతుర్యం. దీంతో వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్, మిగిలిన పార్టీలకు దాదాపు సరిసమానంగా హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపినే గెలిచి, దేశంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే చంద్రబాబు కీలకంగా మారుతారు. సో.. ఈ విషయం మోదీ, అమిత్‌షాలకి కూడా తెలుసు. ఇక తాజాగా అమరావతిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. చంద్రబాబు మాత్రం పాము చావకుండా, కర్ర విరగకుండా కేవలం మనం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని, కాబట్టి పార్లమెంట్‌లో నిరసన గళం వినిపించి అన్ని పార్టీల ఎంపీల మద్దతును కూడగట్టాలని ఎంపీలకు సూచించారు. మరోవైపు ఏపీకి ప్రత్యేకహోదా బదులు ప్రత్యేకప్యాకేజీ ఇచ్చారని, అది కూడా ఇవ్వకపోవడంతోనే తాము మరలా ప్రత్యేకహోదా కోసం పట్టుబడుతున్నామని, ఇతర ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు త్వరలో ప్రత్యేకహోదా ఉండదని చెప్పారని, కానీ ప్రత్యేకహోదా ఆ రాష్ట్రాలకు కొనసాగుతూనే ఉందని టీడీపీ ఎంపీలు అంటున్నారు.
దాంతో స్వయంగా రంగంలోకి దిగిన అమిత్‌షా చంద్రబాబుని కలిసి విభజన హామీలపై చర్చిద్దామని కోరాడు. వాస్తవానికి ఈ సమావేశానికి చంద్రబాబు వచ్చేలా చేయాలనేది అమిత్‌షా వ్యూహం. కానీ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా తనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వనిమోడీ వైఖరికి టిట్ ఫర్‌టాట్‌లా చంద్రబాబు కూడా సుజనా చౌదరి నేతృత్వంలో బృందాన్ని పంపిస్తానని, తాను రాలేనని ఖరాఖండీగా చెప్పాడు. మొత్తానికి టిడిపిని దూరం చేసుకోవడం, వైసీపీకి దగ్గర కావడం బిజెపికే నష్టమని బిజెపి కేంద్రనాయకత్వం భావిస్తోంది.